2024లో జగన్‌పై గెలిచేందుకు ‘పీకే’తో టీడీపీ డీల్!
- IndiaGlitz, [Friday,June 14 2019]
టైటిల్ చూడగానే కాసింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ.. అవును మీరు వింటున్నది నిజమే.. 2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. కనివినీ ఎరుగని విజయం కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. అసలు రానున్న ఎన్నికల దాకా టీడీపీ ఉంటుందా..? ఉండదా..? ఇంతకీ చంద్రబాబు చేతిలోనే పగ్గాలుంటాయా..? లేకుంటే మారతాయా..? ఇలా మిలియన్ల ప్రశ్నలు టీడీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడుతున్నాయి. ఇలాంటి పక్షంలో టీడీపీలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
గతం గత: ఇక బాబుకు మిగిలింది 2024 ఎన్నికలే. అప్పుడు సత్తా చాటాల్సి ఉంది. దీంతో మళ్లీ పార్టీని గెలిపించుకోవడం ఎలా అనే దానిపై ఇప్పటి నుంచే చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారట. ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికలతో వైసీపీకి పీకే టీమ్‌కు ఉన్న కాంట్రాక్ట్ ముగిసిందని సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అప్పుడే ప్రశాంత్ కిశోర్ బృందంతో ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ఈ మేరకు ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఎంత వరకు నిజమో.. అటు పీకే గానీ ఇటు టీడీపీగానీ రియాక్ట్ అయితే స్పష్టత వచ్చే అవకాశముంది.