అనైతిక చర్యలకు తెరదీసిన టీడీపీ.. మహిళల భద్రతకు పెనుముప్పు..

  • IndiaGlitz, [Saturday,May 11 2024]

ఊరందరికీ నీతులు చెప్పడంలో ముందుండే తెలుగుదేశం పార్టీ.. ఆ నీతులను మాత్రం పాటించదు. ఎన్నికల్లో గెలవడం కోసం ఎలాంటి నీచానికైనా చంద్రబాబు ఒడిగొడుతారని వైసీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తు ఉంటారు. అలాగే ఇప్పుడు సరిగ్గా ఎన్నికల వేళ అనైతిక చర్యలకు టీడీపీ పాల్పడుతోందని చెబుతున్నారు. గ్రామాల్లో.. పట్టణాల్లో వాలంటీర్లు మహిళలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారని... ఈ సమాచారం కిడ్నాపర్ల చేతికి చేరుతోందని... దీంతో ఒంటరి మహిళలను కిడ్నాప్ చేస్తున్నారని చంద్రబాబు, ఆయన మిత్రుడు పవన్ కల్యాణ్‌ తీవ్ర ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో మాత్రం రాష్ట్రంలోని మొత్తం మహిళలు, వారి వయసు, ఊరు, అడ్రస్, ఆధార్ వంటి వివరాలు సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసాధికార సర్వే పేరుతో ప్రజల సమాచారాన్ని సేకరించి, అప్పట్లోనే డేటా చౌర్యానికి పాల్పడి టీడీపీ సేవా మిత్ర యాప్‌లో పొందుపరిచారని చెబుతున్నారు. తాజాగా దాన్ని మరింత ఆధునీకరించి ఇప్పుడు ‘వుయ్‌’ యాప్‌ తెచ్చారంటున్నారు. ఇందులో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఆధార్, ఫోన్‌ నంబర్లు, ఓటరు ఐడీ నంబర్లు, వృత్తి తదితర వ్యక్తిగత వివరాలన్నీ పొందుపరిచారని పేర్కొంటున్నారు.

ఇది ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు పూర్తి విరుద్ధమని మండిపడుతున్నారు. ప్రతి మహిళా వివరాలూ తమ దగ్గర దాచిపెట్టుకుని వారి వ్యక్తిగత స్వేచ్ఛను సైతం హరించేందుకు కుట్ర పన్నుతున్నారని.. ఇది పూర్తిగా అనైతికమని విమర్శిస్తున్నారు. అధికారంలో ఉండగా ప్రజా సాధికార సర్వే పేరుతో డేటా చౌర్యం చేయగా.. ఇప్పుడు ‘వుయ్‌’ యాప్‌లో ఓటర్ల సమగ్ర సమాచారం తీసుకుని ఓటర్ల స్లిప్పులతో ప్రత్యేక బార్‌కోడ్‌ ఉన్న కరపత్రాల పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. బార్‌కోడ్‌ స్కాన్‌ చేయగానే హైదరాబాద్‌ నుంచి డిజిటల్‌ చెల్లింపులు.. ఓటరుకు రూ.5 వేలు చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

బూత్‌ కమిటీల ద్వారా ఇంటింటా స్లిప్పుల పంపిణీ.. దీని పర్యవేక్షణ, బార్‌కోడ్‌ స్కాన్‌కు మరో బృందం ఏర్పాటుచేసుకున్నట్లు వివరిస్తున్నారు. ఈ మొత్తం పర్యవేక్షణకు హైదరాబాద్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి నియోజకవర్గానికి రూ.87.50 కోట్ల చొప్పున డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్నట్లు వివరిస్తున్నారు. ఈ డిజిటల్ చెల్లింపులకు ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారని.. ఈ డేటా దుర్వినియోగమైతే వారి భద్రతకు పెను ముప్పు అని ప్రజల్లో ఆందోళన నెలకొందని వెల్లడిస్తున్నారు.