Chandrababu Naidu:టీడీపీ అధినేతకు మరో షాక్ .. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసిన జగన్ సర్కార్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో వున్నారు. జైలు నుంచి విడుదలయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయనకు పీఎస్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సర్వీస్ నిబంధనలు అతిక్రమించినందుకు గాను శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుతం విదేశాల్లో శ్రీనివాస్ :
పెండ్యాల శ్రీనివాస్ ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆయన పాత్ర వెలుగుచూసిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబు షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికాకు పారిపోయారు. శుక్రవారం లోగా రాష్ట్రానికి రావాలని ఆదేశించినప్పటికీ ఆయన స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు విధించింది ప్రభుత్వం.
కమీషన్లు ఇవ్వకుంటే రూల్స్ కొరడా :
నవ్యాంధ్రకు తొలి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత చంద్రబాబు అవినీతి బాగోతాల్ని ఐటీ శాఖ వెలికి తీసింది. తనకు, తన మనుషులకు కమీషన్ల రాకుంటే నిబంధనల పేరుతో కొరడా ఝళిపించేవారు. వీటి ధాటికి ఎంతటి పెద్ద కాంట్రాక్టర్ అయినా తన దారికి రావాల్సిందే. అలా 2014 నుంచి 2019 మధ్య కాలంలో షాపూర్జీ పల్లోంజీ, లార్సన్ టూబ్రో సంస్థలు కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ పనులు చేశాయి.
స్టీల్, టన్ను అంటూ కోడ్ :
ఈ ముడుపుల వ్యవహారాన్ని చంద్రబాబు తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా నడిపించారు. అంతేకాదు.. బయటివారికి, నిఘా సంస్థలకు ఎలాంటి అనుమానం రాకుండా కోడ్‌ను తీసుకొచ్చారు. డబ్బును ఏ ప్రాంతంలో, ఎవరికి పంపించాలో స్పష్టంగా కోడ్ ద్వారానే తెలియజేశారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని వ్యక్తికి డబ్బు పంపాలంటే.. HYD అని, విజయవాడలోని వారికి అయితే విజయ్ అని, విశాఖ అయితే విష్ అని, బెంగళూరు అయితే బాంగ్ అని ఇలా కోడ్‌ను వాడుతూ వాట్సాప్ సంభాషణ చేసుకున్నట్లుగా ఐటీ శాఖ గుర్తించింది. కానీ వీటిలో ఎక్కడా డబ్బు అని గానీ, క్యాష్ అని గానీ పదాలను వాడలేదు. డబ్బుకు బదులుగా స్టీల్ అని .. ఒక కోటిని టన్నుగా పేర్కొన్నారు. ఎవరికి ఎంత ఇవ్వాల్సి వస్తే అన్ని టన్నులుగా చెప్పేవారు. కాంట్రాక్ట్ కంపెనీలకు కన్సల్టెంట్‌గా పనిచేసిన మనోజ్ వాసుదేవ్ పార్ధసానికి, చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు మధ్య నడిచిన చాట్ సంభాషణను స్వాధీనం చేసుకుని ఆ బాగోతాన్ని రట్టు చేశారు ఐటీ అధికారులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout