Chandrababu Naidu:ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు.. కానీ అంతలోనే ఇలా : తారకరత్న మృతిపై చంద్రబాబు భావోద్వేగం

  • IndiaGlitz, [Sunday,February 19 2023]

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తనతో తారకరత్న చెప్పారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆదివారం హైదరాబాద్‌లోని తారకరత్న నివాసంలో ఆయన భౌతికకాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం టీడీపీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. మంచి భవిష్యత్ వున్న వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచనతోనే తారకరత్న వుండేవారని.. ఈ సారి పోటీ చేస్తానని మనసులోని మాటను చెప్పారని చంద్రబాబు తెలిపారు. దీనిపై మాట్లాడుకుని నిర్ణయం తీసుకుందామని తారకరత్నతో అన్నానని.. ఈ ప్రయత్నాల్లో వుండగానే ఆయన చనిపోవడం బాధాకరమన్నారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. భగవంతుడు సహరించాలని, కుటుంబం , అభిమానులు ప్రార్థించినా ఫలితం లేకుండా పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తారకరత్న ఏ ఆశయాల కోసం పనిచేశారో వాటిని ముందుకు తీసుకెళ్లేలా అభిమానులు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా వుంటామని ఆయన హామీ ఇచ్చారు.

కుటుంబ సభ్యులతో కలిసి తారకరత్నకు నివాళులర్పించిన చంద్రబాబు :

అంతకుముందు చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిలు తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. అంతకుముందు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తారకరత్న నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. అనంతరం తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ వెంటనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణిలు కూడా తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈరోజు తన యువగళం పాదయాత్రకు కూడా లోకేష్ బ్రేక్ ఇచ్చారు.

తారకరత్న మరణంతో చంద్రబాబు దిగ్భ్రాంతి:

శనివారం రాత్రి తారకరత్న మరణ వార్త తెలియగానే చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘ నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.