TDP Chief Chandrababu:టీడీపీ అధినేత చంద్రబాబుకు అస్వస్థత.. హుటాహుటిన జైలుకు వెళ్లిన వైద్యులు

  • IndiaGlitz, [Thursday,October 12 2023]

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉక్కపోతకు గురైన ఆయన డీహైడ్రేషన్‌కు గురయ్యారు. ఈ క్రమంలో ఆయన చర్మ సంబంధిత అలర్జీతో బాధపడుతున్నట్లు జైలు అధికారులు గుర్తించారు. దీంతో హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. అత్యవసరం వైద్య నిపుణులను పంపించాలని లేఖలో కోరారు. ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను జీజీహెచ్ అధికారులు కేటాయించగా.. వారు జైలుకు వెళ్లి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ రాత్రికి ఆయన హెల్త్ బుటిటెన్ విడుదల చేయనున్నారు.

చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణులు ఆందోళన..

ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో అస్వస్థతకు లోనైన చంద్రబాబు జైలు వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. అనంతరం బాబుకు పరీక్షలు చేసి ఆరోగ్యంగానే ఉన్నారని.. ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని అతి త్వరలోనే జైలు నుంచి బయటకు రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.

క్వాష్ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో తీర్పు..

కాగా స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో గత నెల 9వ తేదీన అరెస్టైన చంద్రబాబును 10వ తేదీ ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపర్చగా 14రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం రిమాండ్ పెంచుకుంటూ పోయారు. మధ్యలో రెండు రోజులు జ్యూడిషీయల్ కస్టడీ విధించారు. ఈనెల 19వరకు ఆయన రిమాండ్‌లో ఉండనున్నారు. మరోవైపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది.