Chandrababu:టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మరోసారి నిరాశే.. స్కిల్ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
- IndiaGlitz, [Thursday,October 12 2023]
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. చంద్రబాబు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు విచారణ అక్టోబర్ 9న జరగగా.. నేటికి వాయిదా పడింది. నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
క్వాష్ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ..
అటు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ రేపు(శుక్రవారం) జరగనుంది. మంగళవారం జరిగిన విచారణలో ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన ధర్మాసనం రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో రేపు తుది తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్వల్ప ఊరట..
సీఐడీ నమోదు చేసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రింగ్ రోడ్డు కేసులో సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. దీంతో టీడీపీ శ్రేణులకు కొంత ఉపశమనం లభించట్లైంది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా చంద్రబాబు తరపున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని.. కేసుల్లో విచారణకు సహకరిస్తామని కోరారు.