ఎన్నికల ముందు టీడీపీ 'కుట్ర' బట్టబయలు.. షాక్‌‌లో బాబు!

  • IndiaGlitz, [Sunday,March 03 2019]

ఎన్నికల ముందు టీడీపీ కుట్ర బట్టబయలైంది. దీంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు షాక్ గురయ్యారు!. గతకొన్ని రోజులుగా ఏపీలో ఓట్ల తొలగింపు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డాటా చోరీకి గురైందంటూ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆఖరికి ఓట్ల తొలగింపుపై ఏపీ ఎన్నికల అధికారి మొదలుకుని కేంద్ర ఎన్నికల కమిషన్‌‌ వరకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల లబ్దిదారుల డాటా చోరికి గురైందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దీన్ని సీరియస్‌‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఫిర్యాదులో ఏముంది..!?
ఏపీకి చెందిన ఓటర్,ఆధార్ కార్డులు ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పజెప్పడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కీలకమైన డేటాలు ప్రైవేట్ కంపెనీలకు ఎలా చేరాయన్న దానిపై విచారణ జరిపించాలని ఫిర్యాదులో విజసాయిరెడ్డి ఫిర్యాదులో పేర్కోన్నారు. ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్‌కు డేటా లింక్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కంపెనీపై విచారణ జరపాలని సైబరాబాద్, హైదరాబాద్ కమీషనర్లకు వైసీపీ ఫిర్యాదు చేయడం జరిగింది.

అర్ధరాత్రి అసలేం జరిగింది?
లబ్ధిదారుల డాటా మొత్తం ఒక ప్రైవేట్ కంపెనీ కార్యాలయంలో ఉన్నట్లు ఫిర్యాదుల్లో పేర్కోనడం జరిగింది. ఫిర్యాదులో పేర్కొన్న మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న బ్లూ ఫ్రాగ్ ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఆరా తీశారు. ఫిర్యాదులో పేర్కొన్న కార్యాలయం ఆడ్రస్‌‌కు వెళ్లారు. టీడీపీ వివరాలున్న సర్వర్లను ముఖ్యంగా.. సేవామిత్రలు, బూత్‌ కన్వీనర్లు, కార్యకర్తల సభ్యత్వ వివరాలు ఉన్న సర్వర్లను ఆ కంపెనీకి చెందిన కొందరు ముఖ్యులను ఓపెన్ చేయాలని తెలంగాణ పోలీసులు పట్టుబట్టారు. మరోవైపు ఈ సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. మొత్తం 200 మంది ఏపీ పోలీసులు హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం.

ఏపీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులు..?

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ వద్ద ఆంధ్రా, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించడంతో అసలేం జరుగుతోందో మీడియాకు సైతం తెలియరాలేదు. తీరా కంపెనీదాకా వెళ్లేంత వరకు అసలు పరిస్థితి తెలిసొచ్చింది. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఏపీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులుగా పరిస్థితి ఏర్పడింది. ఆఫీసులోపల తెలంగాణ పోలీసులు.. బయట ఆంధ్రా పోలీసులు ఇలా శనివారం అర్ధరాత్రి పెద్ద హంగామానే జరిగింది.!. సర్వర్లు ఓపెన్ చేయాలని తెలంగాణ పోలీసులు ఆఫీసులో తిష్టవేయగా.. సర్వర్లను, ఉద్యోగులను తీసుకెళ్లడానికి వీలులేదని ఏపీ పోలీసులు ఆఫీసు బయట కాపుగాశారు!

పోలీసులు అదుపులో నలుగురు.. వారిలో ఒకరు కీలకం!?

ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కంపెనీకి చెందిన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. వీరిలో భాస్కర్ అనే ఉద్యోగి కీలకమని డాటా గురించి మొత్తం ఇతనికే తెలుసని సమాచారం. అందుకే ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సైబర్ క్రైమ్‌‌‌ ఆఫీసుకు తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఐటీ గ్రిడ్‌లో పనిచేస్తున్న భాస్కర్ అనే ఉద్యోగి కనిపించడం లేదని కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగి హైదరాబాద్‌‌లో పనిచేసే వ్యక్తయితే గుంటూరు పోలీసులకు ఫిర్యాదు అందడం.. వారు ఇక్కడికి రావడం గమనార్హం. ఫిర్యాదు అందుకున్న ఏపీ పోలీసులు భాస్కర్ కోసం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ ఆఫీసు గుంటూరు పోలీసులు వచ్చారు. ఈ వ్యవహారంపై ఆఖరున స్పందించిన సైబరాబాద్ పోలీసులు డేటా చోరీ కేసులో భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే భాస్కర్‌ను తమకు అప్పజెప్పి తీరాల్సందేనని తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు కోరడం జరిగింది.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

ఈ వ్యవహారంపై సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఓ చానెల్‌తో మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్‌ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా బహిర్గతమవుతోందని మాకు ఫిర్యాదు అందింది. ఐపీసీ 120బి, 379,420, 188 ఐపీసీ, ఐటీ యాక్ట్‌లోని 72,66 ప్రకారం కేసు నమోదు చేశాము. ఈ కేసులో ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యం నిందితులుగా ఉన్నారు. ఐటీగ్రిడ్స్ కంపెనీపై సోదాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి ఉద్రిక్త వాతావరణం లేదు అని ఆయన స్పష్టం చేశారు.

కన్నెర్రజేసిన టీడీపీ నేతలు..!

సమాచారం అందుకున్న పలువురు తెలుగు తమ్ముళ్లు తెలంగాణ పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయారు. విజయ సాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు దాడులు చేయడమేంటి..? టీడీపీకి ఐటీ సేవలు అందించే కంపెనీపై దాడులు ఎలా చేస్తారు..? అంటూ తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు!. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. తమ డేటాతో వైసీపీ నేతలకు పనేంటి? ప్రశ్నించారు. మా ఉద్యోగులను ఇబ్బందిపెడితే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదని.. తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు లోకేశ్ స్పందిస్తూ.. టీడీపీకి ఐటీ సహకారం అందిస్తున్న కంపెనీల నుంచి సమాచారాన్ని అపహరించేందుకు హైదరాబాద్‌ కేంద్రంగా కుట్ర జరిగిందన్నారు.

పరస్పర ఫిర్యాదులు..!

ఓ వైపు టీడీపీపై వైసీపీ నేత ఫిర్యాదు చేయగా.. దీనికి కౌంటర్‌గా పార్టీ కార్యకర్తలు, బూత్‌ కన్వీనర్లు, సేవామిత్రలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు వైసీపీ తరఫున కుట్రలు పన్నిందని దీన్ని అడ్డుకోవాలని ఏపీ పోలీసులకు టీడీపీకి చెందిన పలువురు నేతలు ఫిర్యాదులు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. ముఖ్యంగా బ్లూ ఫ్రాగ్‌ కూడా దీనిపై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కాగా ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మొత్తానికి చూస్తే.. 2019 ఎన్నికల్లో మరోసారి గెలుపొందాలని హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ పన్నిన భారీ కుట్ర బట్టబయలైందని వైసీపీ చెబుతోంది. అయితే పోలీసుల అదుపులో ఉన్న భాస్కర్ అనే ఉద్యోగి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండటంతో మున్ముంథు ఇంకా సమాచారం రాబట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ వివాదం కాస్త తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే మరి.