చిలకలూరిపేట సభకు భూమి పూజ.. పాల్గొన్న టీడీపీ-బీజేపీ-జనసేన నేతలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఈనెల 17న చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి సంయుక్తంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభా ప్రాంగణానికి భూమి పూజ చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ నేతృత్వంలో వేదిక నిర్మాణానికి మూడు పార్టీల నేతలు శంకుస్థాపన చేశారు. రాష్ట్రం నుంచి రాక్షస పాలనను పారదోలేందుకు మూడు పార్టీలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ సభను ప్రజలంతా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. 2014 తర్వాత మూడు పార్టీలు కలిసి ఏర్పాటుచేస్తున్న సభ కావడంతో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
అందులోనూ ప్రధాని మోదీతో పాటు టీడీపీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనుండటంతో భారీ జనసమీకరణ, ట్రాఫిక్, సెక్యూరిటీ ఇతర అన్ని అంశాలు పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద జరిగే ఈ సభకు సుమారు ఐదు లక్షల మందికిపైగా జనం వస్తారని అంచనా వేస్తు్న్నాయి. అందుకు తగ్గట్లే 100 ఎకరాలకు పైగా స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సభను విజయవంతం చేయడానికి మూడు పార్టీల నేతలు శ్రమిస్తు్న్నారు.
ఈ సమావేశానికి హాజరయ్యే ప్రధాని విమానం కొరిశపాడు జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా భద్రతా సిబ్బందితో పాటు ఎయిర్‌పోర్స్ స్టాఫ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీ నారాయణ, జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, గాదె వెంకటేశ్వరరావు, షేక్ రియాజ్, బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, లంకా దినకర్ పాల్గొన్నారు.
కాగా 2014 ఎన్నికల సమయంలో మూడు పార్టీలు కలిసే పోటీ చేశాయి. అప్పుడు తిరుపతిలో జరిగిన సభలో ముగ్గురు నేతలు హాజరయ్యారు. మళ్లీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రానున్నారు. ఈ సభ వేదికగా ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు కీలక హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో ఈ సభ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సభ కోసం ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని టీడీపీ నేతలు ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన అధికారులు ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున తరలిరానున్నట్లు నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు స్పష్టతకు వచ్చాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల నుంచి బరిలో దిగనున్నాయి. ఇక 25 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. మొత్తానికి 2014 ఎన్నికల సీన్ రిపీట్ చేయాలని కూటమి నేతలు భావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments