Mudragada: ముద్రగడకు టీడీపీ-జనసేన వల.. మరి 'కాపు' కాస్తారా..?
- IndiaGlitz, [Thursday,January 11 2024]
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రోజురోజుకు పార్టీలు మారే నేతలు ఎక్కువైపోతున్నారు. ఎవరూ ఏ పార్టీలోకి వెళ్తారో తెలియడం లేదు. ఎవరు ఔనన్నా కాదన్నా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపుల ఓట్లు కీలకం. అందులోనూ ఉభయ గోదావరి జిల్లాలోని 34 నియోజవకర్గాల్లో కాపులు ఎక్కువగా ఉన్నారు. ఈ జిల్లాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఇక్కడ పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించారు. జనసేనకు కాపు ఓట్లు దూరం చేసేందుకు సీఎం జగన్ కాపు ఉద్యమ నేత ముద్రగడను చేరదీసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమలోనే ఆయనను పార్టీలోకి చేర్చుకుని ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని భావించారు.
వైసీపీలో చేరేందుకు సిద్ధం..
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ కాకినాడలో వారాహి యాత్ర చేసినప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిపై ఘాటు విమర్శలు చేశారు. దీనికి కౌంటర్‌గా పవన్‌ను విమర్శిస్తూ ముద్రగడ లేఖ రాయడం సంచనలంగా మారింది. దీంతో కాపు పెద్దల్లో విభేదాలు నెలకొన్నాయి. కొంతమంది పవన్‌కు సపోర్ట్‌గా నిలిస్తే.. మరికొంతమంది ముద్రగడకు మద్దతు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయమైందనే ప్రచారంలో జోరుగా జరిగింది. త్వరలోనే సీఎం జగన్ సమక్షంలో ఆయన ఫ్యాన్ కండువా కప్పుకోనున్నారనే వార్తలు బయటకు వచ్చాయి.
జనసేన పార్టీలోకి ఆహ్వానం..
ఇంతవరకు బాగానే ఉంది కానీ గత రెండు రోజులుగా గోదారి జిల్లాల రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముద్రగడను జనసేన నేతలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాడేపల్లి గూడెం జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, సీనియర్ నేత తాతాజీలు ముద్రగతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఆయనతో ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించారు. అనంతరం జనసేనలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పవన్ కల్యాణ్‌తోనూ సమావేశం అయ్యేందుకు ముద్రగడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తారుమారాయి.
టీడీపీకి మద్దతివ్వాలని విన్నపం..
తాజాగా టీడీపీ సీనియర్ జ్యోతుల నెహ్రు ముద్రగడ పద్మనాభంను ఆయన నివాసంలో కలిశారు. పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మొత్తానికి కాపులంతా ఐక్యంగా ఉండాలని.. ఈ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని ముద్రగడకు సూచించినట్లు చెబుతున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ కాపు పెద్దలకు నా విజ్ఞప్తి అంటూ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై ముద్రగడ సానుకూలంగా స్పందించారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కాపు పెద్దలందరూ టీడీపీ-జనసేన కూటమికి మద్దతిచ్చేలా ప్రణాళికలు ఊపందుకున్నాయి. ముద్రగడ కానీ జనసేనలో చేరితో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.