మంత్రి రజినీ కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తల రాళ్ల దాడి..
- IndiaGlitz, [Monday,January 01 2024]
కొత్త సంవత్సరంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. అర్థరాత్రి పూట గుంటూరులో వీరంగం సృష్టించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్, మంత్రి విడదల రజినీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు ఫ్లెక్సీలు చించివేసి రౌడీల్లా ప్రవర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి లాఠీఛార్జీ చేస్తున్నా సరే కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
ఇటీవల గుంటూరు పశ్చిమ నియోకజకవర్గ ఇంఛార్జ్‌గా నియమితులైన మంత్రి విడదల రజినీ విద్యానగర్‌లో కొత్త కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆఫీస్ ప్రారంభించాలనుకున్నారు. అయితే గత అర్థరాత్రి టీడీపీ-జనసేన గూండాలు కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో మంత్రి రజినీ, స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరి కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా రజినీ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో బీసీ మహిళనైన తన పోటీని చూసి ఓర్వలేకనే టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారని తీవ్రంగా ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని అందుకే ఇలాంటి భౌతిక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని.. దీని వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేశ్‌లు బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని బీసీలంటే ఎంత చిన్నచూపో అర్థమవుతుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ బీసీ మహిళ పోటీ చేయడాన్ని తట్టుకోలేక టీడీపీ రౌడీలు దాడులకు పాల్పడ్డారని.. ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బీసీ మహిళ పోటీ చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారని.. రాళ్ల దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. .
అయితే ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీసీ మహిళా మంత్రి కార్యాలయంపైనే ఇలా దాడులకు పాల్పడటాన్ని ప్రజలు కరాఖండిగా ఖండిస్తున్నారు. టీడీపీ-జనసేన నాయకులు బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండి ఏకంగా మంత్రిపై దాడికి పాల్పడితే.. ఇక ఇలాంటి వారికి అధికారం అప్పగిస్తే రాష్ట్రంలోని బడుగుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు బీసీలు రాజకీయ సమాధి కట్టాలని అభిప్రాయపడుతున్నారు.