Volunteers: ఇంటింటి బంధువులైన వాలంటీర్లపై టీడీపీ కూటమి విష ప్రచారం
- IndiaGlitz, [Tuesday,March 26 2024]
వాలంటీర్లు అనే పదం.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువగా వినపడుతున్న పేరు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. తాను ప్రకటించిన నవరత్నాల పథకాలు ప్రజలకు నేరుగా చేరువకావడంతో పాటు ప్రభుత్వ పథకాలు వారికి చేరాలంటే వాలంటీర్ వ్యవస్థ ముఖ్యమని భావించారు. ఈ క్రమంలోనే దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లను నియమించారు. దీంతో ఇంతకుముందెన్నడూ లేని విధంగా వాలంటీర్లు ప్రభుత్వ పాలనా వ్యవస్థలో భాగమైపోయారు. ప్రతి గ్రామంలో ఏ ఇంట్లో కష్టం వచ్చినా మేమున్నాం అంటూ గుమ్మం ముందు నిలబడే వాలంటీర్ ఆ ఇంటికి బంధువయ్యారు.. ఆపదలో ఆదుకునే ఆపన్నుడయ్యారు.. పిలవగానే వచ్చే ఆత్మీయుడయ్యారు..
ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీరును ప్రభుత్వం నియమించగా వారి ద్వారా ప్రతి కుటుంబానికి సేవలు చేరువయ్యాయి. ప్రతినెలా ఒకటో తేదీ తెల్లవారక ముందే పింఛన్ అందించడం దగ్గర నుండి కుల, ఆదాయ, ఇతర ధృవీకరణసేవలూ వారే దగ్గరుండి చేయిస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లు ప్రతి ఇంట్లో భాగమయ్యారు. అందుకే ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యవస్థపై కక్ష కట్టాయి. ఏదో రకంగా వాలంటీర్ వ్యవస్థపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారానికి ఒడిగట్టారు. వ్యక్తిగత డేటా చోరీ అవుతుందనే ప్రచారం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా ఏకంగా వాలంటీర్లును వైసీపీ స్లిపర్ సెల్స్‌గా అభివర్ణిస్తున్నారు.
గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరిట జరిగిన దోపిడి, మోసాల నుంచి వాలంటీర్ వ్యవస్థ విముక్తి కలిగించింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటి వద్దనే అన్ని రకాల సేవలు అందుతున్నాయి. రూపాయి లంచం లేకుండా డీబీటీ ద్వారా పనులు పూర్తవుతున్నాయి. నిజమైన లబ్దిదారులను గుర్తించడంలో పని సులభతరమైంది. దీంతో వాలంటీర్ వ్యవస్థను నిర్మూలించాలని టీడీపీ కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటనలు చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నక్కజిత్తుల మాటలు చెప్పి అధికారం కోసం తహతహలాడుతోంది కూటమి. కానీ ప్రజలు వీరి మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరు. తమకు నేరుగా పథకాలు అందిస్తోన్న వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటామని తేల్చిచెబుతున్నారు.