పవన్ కల్యాణ్ పోటీపై పిఠాపురం టీడీపీలో ఆగ్రహజ్వాలలు.. పెనమలూరులో కూడా..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల తర్వాత టికెట్ ఆశించిన కొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీలో కష్టపడిన తమకు టికెట్లు ఇవ్వలేని రగిలిపోతున్నారు. వారి అనుచరులు అయితే బీభత్సం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడి టీడీపీ ఇంఛార్జ్ వర్మ వర్గీయులు తీవ్ర ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాయలంలోని టీడీపీ జెండాలను, ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. వర్మను చంద్రబాబు, లోకేష్ దారుణంగా మోసం చేశారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టికెట్ వర్మకే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయాలని కోరుతున్నారు.
ఇక పిఠాపురం టీడీపీ టికెట్ తనదే అని ఇప్పటివరకు ధీమాగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ.. పవన్ ప్రకటనతో హతాశులయ్యారు. ఇది అన్యాయం అని ఆక్రోశించారు. "ఇప్పటివరకు పిఠాపురం ప్రజల కష్టాల్లో భాగం అయ్యాను.. నియోజకవర్గం అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేశాను. ఇన్ని చేసిన నాకు ఇది తీరని అన్యాయం. ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయం"అని ట్వీట్ చేశారు.
మరోవైపు పెనమలూరు టికెట్ తనకు లేదని అధిష్టానం చెప్పడంతో టీడీపీ నేత బోడె ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ వస్తుందని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని కానీ టికెట్ లేదని చెప్పడంతో గుండె పిండేసినట్టయిందని వాపోయారు. తాను చంద్రబాబు భక్తుడిని అని ఉద్ఘాటించారు. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నానని.. ఎక్కడా చిన్న అవినీతి మరక కూడా అంటించుకోలేదన్నారు. 2019లో ఓడిపోయినా కూడా ప్రజల మధ్యే ఉంటూ పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమం తప్పకుండా నిర్వర్తించానని తెలిపారు.
ఆస్తులు ఉన్నా లేకపోయినా సంవత్సరానికి ఒక కోటి రూపాయలు ఖర్చు చేస్తూ పెనమలూరులో టీడీపీని నిలబెట్టుకుంటూ వచ్చానని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో సుమారుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టానని.. లోకేశ్ పాదయాత్రలో ఎంత ఖర్చు పెట్టి విజయవంతం చేశామో ప్రజలందరికీ తెలుసన్నారు. పార్టీ అయితే మారనని.. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని.. ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబుకు బహుమానంగా ఇస్తానని తెలిపారు.
ఇక విశాఖలో కీలక నేత గండి బాబ్జీ పార్టీకి రాజీనామా చేశారు. రెండు జాబితాల్లో తన పేరు లేకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. రెండో జాబితాలో తనకు విశాఖ సౌత్ లేదా పెందుర్తి టికెట్ వస్తుందని ఆయన ఆశించారు. అయితే తనకు టికెట్ రాదని తెలియడంతో మనస్తాపానికి గురైన ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు.
ఇదిలా ఉంటే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా రెండో జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్నారు. ఆయన భీమిలి టికెట్ ఆశిస్తున్నారు.. కానీ చంద్రబాబు మాత్రం మంత్రి బొత్స సత్యనారాయణ వహిస్తున్న చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. ఇది ఇష్టంలేని గంటా తన అనుచరులతో సమావేశమయ్యారు. వారితో చర్చించిన అనంతరం తన కార్యాచరణ ప్రకటించనున్నారు. దీంతో గంటా నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments