Taxiwaala Review
ప్రస్తుతం యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. `పెళ్ళిచూపులు`తో హీరోగా సక్సెస్ అందుకున్న ఈ కుర్ర హీరో `అర్జున్ రెడ్డి` బ్లాక్‌బస్టర్ హిట్‌తో సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ఇటీవల విడుదలైన `గీత గోవిందం`తో వందకోట్ల కలెక్షన్స్ వసూలు చేయగల స్టామినా ఉన్న హీరోగా ఎదిగాడు. దాంతో విజయ్ తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తదుపరి విడుదలైన నోటా కాస్త నిరాశనే మిగిల్చింది. కాగా ఎప్పుడో విడుదలవుతుందనుకున్న `టాక్సీవాలా` ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వి.ఎఫ్.ఎక్స్ సరిగ్గా రాకపోవడం సినిమాను ఆలస్యం చేస్తే.. సినిమా మొత్తం పైరసీకి గురైంది. దీంతో ఖంగుతిన్న చిత్ర యూనిట్ తగు చర్యలు తీసుకున్నా.. మనసులో ఎక్కడో చిన్న భయం ఉండిపోయింది. ఇన్ని సమస్యలను దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన `టాక్సీవాలా` ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం..
కథ:
అత్తెసరు మార్కులతో డిగ్రీ పాసైన శివ(విజయ్ దేవరకొండ) ఉద్యోగం కోసం హైదరాబాద్ చేరుకుంటాడు. అక్కడ తన స్నేహితులు(మధు నందన్, విష్ణు) కారు మెకానిక్స్ గా ఉంటే వాళ్లతో పాటే ఉంటుంటాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి అవేవీ తనకు సెట్ కాదని అర్థం చేసుకున్న శివ క్యాబ్ డ్రైవర్ కావాలనుకుంటాడు. అందుకోసం కారు కొనాలనుకుని తన అన్న(రవిప్రకాశ్), వదిన(కల్యాణి)ల సహాయం కోరుతాడు. చివరకు వదిన తన నగలు అమ్మిన ఇచ్చిన డబ్బులతో ఓ కారు కొంటాడు శివ. కారు వచ్చిన తర్వాత శివకు అన్ని మంచి విషయాలే జరుగుతుంటాయి. డాక్టర్ చదువుకున్న అమ్మాయి(ప్రియాంక జవాల్కర్)తో ప్రేమలో పడతాడు. వదినకు కార్పొరేట్ హాస్పిటల్‌లో వైద్యం చేయించే స్థాయిలో సంపాదన వస్తుంటుంది. అంతా బాగుందనుకుంటున్న సమయంలో తన కారులో ఓ దెయ్యం ఉందనే నిజం శివకు, అతని స్నేహితులకు తెలుస్తుంది. ఆ కారును వదిలించుకోవాలని శివ అండ్ గ్యాంగ్ చేసే పనులన్నీ వృథా అవుతాయి. చివరకు తనకు కారు అమ్మిన యజమానిని శివ కలుసుకోవాలని చూస్తాడు. కానీ అతను అందుబాటులో ఉండడు. ఆ ఇంట్లోకి శివ స్నేహితులతో చొరబడతాడు. అక్కడ శివకు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలు శిశిర ఎవరు? ఆమెకు, కారుకు ఉన్న సంబంధమేంటి? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
శివ అనే క్యాబ్ డ్రైవర్ పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. పాత్రలో ఒదిగిపోయాడు. ప్రేమలో పడటం.. అమ్మాయి ముద్దు ఇవ్వకుండా వెళ్లిపోయే సందర్భంలో అతను చూపే ఎక్స్‌ప్రెషన్స్ అన్ని బావున్నాయి. ఇక సందర్భానుసారం విజయ్ నటనతో కామెడీ కూడా సన్నివేశాల్లో చక్కగా జనరేట్ అయ్యింది. అలాగే మధునందన్.. హాలీవుడ్ అనే కుర్రాడి పాత్రలో నటించిన విష్ణు చక్కటి కామెడీని పండించారు. దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్‌ను ఆసక్తికరంగా మలిచాడు. కారులో దెయ్యం ఉందనే కాన్సెప్ట్ ఎప్పటిదో అయినా సన్నివేశాలను రాహుల్, సాయికుమార్ రెడ్డి ఆసక్తికరంగా రాసుకున్నాడు. ఫస్టాఫ్ అంతా హీరో, అతని స్నేహితులు చేసే కామెడీ చక్కగా ఉంటుంది. ఇక సెకండాఫ్ విషయానికి వచ్చేసరికి కథంతా సీరియస్ మోడ్‌లోకి వెళుతుంది. సెకండాఫ్‌లో హాస్పిటల్‌లో హీరో స్నేహితులు చేసే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ బావుంది. సుజిత్ సారంగ్ కెమెరా వర్క్ బావుంది. జేక్స్ బిజోయ్ అందించిన పాటల్లో మాట వినదు కదా.. సాంగ్ బావుంది. అలాగే నేపథ్య సంగీతం బావుంది.
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ హెవీగా అనిపిస్తుంది. సినిమా కంటెంట్ పరంగా బావున్నా.. ప్రస్తుతం విజయ్‌కి ఉన్న ఇమేజ్ దృష్ట్యా అదెంత మేర వర్కవుట్ అవుతుందనేది చూడాలి.
విశ్లేషణ:
ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్లితే సినిమాను చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే ఫస్టాఫ్ అంతా ఫన్నీగా కొన్ని హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్, లవ్ సన్నివేశాలతో ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా దర్శకుడు రాహుల్ కథలోని మెయిన్ పాయింట్‌ను నేరుగానే చెప్పేశాడు. అసలు కారులోకి దెయ్యం వచ్చిందనే పాయింట్‌కు ఆస్ట్రా ప్రొజెక్షన్‌కు లింక్ పెట్టి దర్శకుడు రాసుకున్న ఎలిమెంట్‌ను సెకండాఫ్‌లోనే రివీల్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. సినిమా అంతా సస్పెన్స్ డ్రామాలా సాగడంలో స్క్రీన్ ప్లే అందించిన సాయికుమార్ సక్సెస్ అయ్యారు. కథాగమనంలో సీక్రెట్స్ రివీల్ చే్స్తూ వచ్చారు. అన్న పాత్రలో రవిప్రకాశ్, వదినగా కల్యాణి.. హీరోయిన్ ప్రియాంక, సిజ్జు, కామెడీ పండించిన మధునందన్, విష్ణు పాత్రలు పరిధుల మేర చక్కగా నటించారు. ఇంటర్వెల్ కారు చేజ్ సీన్ బావుంటుంది. అలాగే మాళవికా నాయర్ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలో చక్కగా నటించింది. చాలా గ్యాప్ తర్వాత సీనియర్ నటి యమున మంచి పాత్రలో కనిపించారు. దర్శకుడి పనితనానికి సాంకేతిక నిపుణులు తోడయ్యారు.
బోటమ్ లైన్: టాక్సీవాలా.. ఫన్నీ, థ్రిల్లింగ్ రైడ్
Read Taxiwaala Movie Review in English
- Read in English