Rajyasabha Elections: టార్గెట్ రాజ్యసభ ఎన్నికలు.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సిద్ధం..
Send us your feedback to audioarticles@vaarta.com
రాజ్యసభ ఎన్నికలే టార్గెట్‌గా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. ఈ మూడు స్థానాల్లో ఒకటి వైసీపీ సిట్టింగ్ కాగా.. మిగిలిన రెండు టీడీపీ స్థానాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాజ్యసభ స్థానాలను దక్కించుకునేందుకు వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం వైసీపీకి ఉన్న సంఖ్యా బలం పరంగా మూడు స్థానాలూ వైసీపీకే దక్కే అవకాశం ఉంది.
దీంతో వైసీపీ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, జంగాలపల్లి శ్రీనివాస్‌లను ఖరారుచేసింది. అయితే ప్రస్తుతం చేస్తున్న మార్పులు చేర్పుల కారణంగా అసంతృప్త ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేల బలాన్ని తగ్గించేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది. వైసీపీ నుంచి టీడీపీకి మారిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి.. టీడీపీ నుంచి వైసీపీకి మారిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరి, జనసేన నుంచి వైసీపీకి వెళ్లిన రాపాక వరప్రసాద్‌లకు స్పీకర్ నోటీసులు పంపారు.
పార్టీ మార్పుపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో వారిపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారం ఆమోదించిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత స్పీకర్ ఆమోదించడం విశేషం.
మొత్తానికి గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పొరపాటులను రాజ్యసభ ఎన్నికల్లో రిపీట్ కాకుండా వైసీపీ కసరత్తు చేస్తోంది. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout