Tammareddy:ఆస్కార్ కోసం అంత ఖర్చా.. ఆ డబ్బుతో 8 సినిమాలు తీయొచ్చు: ఆర్ఆర్ఆర్ యూనిట్‌పై తమ్మారెడ్డి వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆస్కార్ నామినేషన్స్‌లో నిలవడంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తం అమెరికాలో సందడి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కార్ కొట్టి తీరాలన్న కసితో జక్కన్న పనిచేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మీడియాతో పాటు హాలీవుడ్ ప్రముఖులతో రాజమౌళి భేటీ అవుతున్నారు. అలాగే హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా, నందమూరి అభిమానులతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఫ్లైట్ టికెట్లకే రూ.80 కోట్లు ఖర్చు :
ఇలాంటి పరిస్ధితుల్లో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ అవార్డ్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఖర్చు పెడుతున్న మొత్తంతో 8 సినిమాలు తీయొచ్చంటూ వ్యాఖ్యానించారు. గురువారం హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రివ్యూ థియేటర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమ్మారెడ్డి.. పలు కీలక విషయాలపై స్పందించారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో నిలిచిన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ అవార్డ్ కోసం చేస్తున్న ఖర్చుతో 8 సినిమాలు తీయొచ్చని భరద్వాజ అన్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణం కోసం రూ.600 కోట్ల బడ్జెట్ అయ్యిందని.. మళ్లీ ఇప్పుడు ఆస్కార్ దక్కించుకునేందుకు చిత్ర యూనిట్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందన్నారు. విమాన టికెట్లు, అమెరికాలో బస, ఇతర ఖర్చుల కోసం అంత వెచ్చిస్తున్నారని.. ఈ మొత్తతం 8 సినిమాలు చేయొచ్చని తమ్మారెడ్డి చురకలంటించారు.
సినిమాలు తీసి మార్చాలని చూడొద్దు :
ఇక సినిమాల నిర్మాణం గురించి మాట్లాడుతూ.. సినిమాలు తీసి ప్రేక్షకులకు ఏదో నేర్పించాలని వాళ్లని , మార్చాలని చూడొద్దన్నారు. కేవలం మనకి నచ్చినట్లు మనం సినిమా తీయాలని మేకర్స్‌కి ఆయన హితవు పలికారు. ఆర్ఆర్ఆర్ వంటి సినిమాను తాము చేయలేమని.. కేవలం చూస్తామని తమ్మారెడ్డి అన్నారు. మంచి కథ వుంటే బడ్జెట్ అనేది పెద్ద సమస్య కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమ్మారెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశమయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments