రూపాయి.. రూపాయి దాచుకుని రూ. 2.6 లక్షల పోగేసి .. డ్రీమ్ బైక్ కొన్న యువకుడు
- IndiaGlitz, [Monday,March 28 2022]
చిన్నప్పుడు మనకు నచ్చిన వస్తువు అమ్మానాన్న కొనివ్వలేదు అనుకోండి.. అప్పుడేం చేసేవాళ్లం.. పాకెట్ మనీగా ఇచ్చిన డబ్బుల్ని కిడ్డీ బ్యాంక్‌లో దాచుకుని కొనుక్కునేవాళ్లం. పెరిగి పెద్దయిన తర్వాత చాలా మందికి ఈ అలవాటు వుంటుంది. కాకపోతే.. కాయిన్స్‌కి బదులు నోట్లు దాచుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన డ్రీమ్ బైక్ కొనుగోలు చేసేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.2 లక్షల రూపాయల నాణేలను సేకరించాడు. అది కూడా అన్ని రూపాయి నాణేలు కావడం విశేషం. సంచలనం రేపిన ఈ ఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. అతని పేరు భూబతి.
తనకు కావాల్సిన మొత్తం పోగవ్వగానే.. చిల్లర తీసుకుని బైక్ షోరూం వద్దకు చేరుకున్న అతను నచ్చిన కొత్త బజాజ్ డామినార్ బైక్ కొనుగోలు చేశాడు. భూబతి అతని నలుగురు స్నేహితులతో పాటు ఐదుగురు షోరూం సిబ్బంది ఈ నాణేలను లెక్కిండానికి ఏకంగా 10 గంటల సమయం పట్టింది. భూబతి బిసీఏ చదువుకున్నాడు. నాలుగేళ్ల క్రితం యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించే ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు.
అప్పట్లో ఈ బైక్ ఖరీదు రూ.2 లక్షలు ఉండేది. అయితే ఇప్పుడు 2 లక్షల 60 వేలకు చేరుకుంది. ఎలాగైనా తన డ్రీమ్ బైక్ కొనాలని డిసైడ్ అయిన భూబతి.. మూడేళ్ల క్రితం నుంచే రూపాయి నాణేలను సేకరించి తన పిగ్గీ బ్యాంకులో వేస్తూ వచ్చాడు. అలా సరిపడినంత డబ్బు పోగయ్యాక ఆ చిల్లర నాణేలతో బైక్ షోరూంకు వెళ్లి నచ్చిన బైక్ కొనుగోలు చేసి కల నెరవేర్చుకున్నాడు. అయితే తొలుత భూబతి నుంచి నాణేలు సేకరించడానికి ఇష్టపడలేదని… కానీ అతనిని నిరాశపరచకూడదని స్వీకరించాం అని షోరూం నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.