Tamilisai:బ్రేకింగ్: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

  • IndiaGlitz, [Monday,March 18 2024]

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తన పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను పంపించారు. ఆమె రాజీనామా చేసినట్లు రాజ్‌భవన్ ధృవీకరించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చెన్నై సెంట్రల్ నియోజకవర్గం లేదా తూత్తుకుడి లేదా కన్యాకుమారి ఎంపీ స్థానాల నుంచి తమిళిసై బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి ఎల్జీ పదవికి కూడా ఆమె రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.

తమిళనాడు పీసీసీ మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్ కుమార్తె అయిన తమిళిసై సౌందరరాజన్.. బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1999లో పార్టీలో చేరారు. తమిళనాట బీజేపీ బలోపేతంలో ఆమె పాత్ర కీలకమైంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పలు పదవులను నిర్వహించారు. 2006 ఎన్నికల్లో రామనాథపురం నియోజవర్గం నుంచి తొలిసారి పోటీ చేయగా ఓటమి ఎదురైంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరచెన్నై నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు.

అనంతరం 2011 ఎన్నికల్లో శాసనసభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయారు. అలాగే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేయగా.. ఓటమి ఎదురయ్యింది. అయితే పార్టీలో ఆమె సేవలను గుర్తించిన బీజేపీ అధినాయకత్వం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా ఫిబ్రవరి 18, 2021న నియమితులయ్యారు. కాగా గత 25 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఆమె ఇంతవరకు విజయం సాధించలేదు. ఈసారి ఎలాగైనా ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.