సూర్య సినిమాలు బ్యాన్..!
- IndiaGlitz, [Saturday,April 25 2020]
తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. అందుకనే ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ఈయన నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తుంటారనే సంగతి కూడా తెలిసిందే. ముఖ్యంగా తన సతీమణి జ్యోతిక నటించే సినిమాలకు సూర్యనే నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. తాజాగా జ్యోతిక ప్రదానపాత్రలో నటించిన ‘పొన్‌మగల్ వందాల్’ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. కరోనా ప్రభావంతో సినిమా ఆగిపోయింది. దీంతో సూర్య తన సినిమాను డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ రకంగా ప్రకటనను కూడా విడుదల చేశారు. అయితే ఇది సూర్యకు కొత్త సమస్యను తెచ్చి పెట్టింది.
సూర్యపై తమిళ థియేటర్స్ సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సాధారణంగా సినిమాలను థియేటర్స్ దృష్టిలో ఉంచుకుని తెరకెక్కిస్తారు. కానీ సూర్య నేరుగా ఓటీటీలో విడుదల చేయడాన్ని థియేటర్స్ సంఘం అధ్యక్షుడు పన్నీర్ సెల్వం వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని సూర్య వెనక్కి తీసుకోవాలని లేకుంటే ఆయన నటించిన సినిమాలపై నిషేధం విధిస్తాం అని పన్నీర్ సెల్వం తెలిపారు.ఈ మధ్య కాలంలో విడుదలైన సూర్య సినిమాలు ఎన్‌జీకే, బందోబస్త్(కాప్పాన్) చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేపోయాయి. అయితే ఈ ఏడాది సమ్మర్‌లో 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న సూర్య స్పీడుకు కరోనా వైరస్ బ్రేకేసింది. సూర్య ఈ సినిమా సక్సెస్‌పై చాలా నమ్మకంగా ఉన్నారు.