Vijay Thalapathy: సీఏఏ చట్టం అమలుపై తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తీవ్ర ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు దేశ పౌరసత్వాన్ని కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల స్టంట్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.
తాజాగా ఈ చట్టం అమలుపై తమిళ స్టార్ హీరో తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్ స్పందించారు. భారత పౌరసత్వ సవరణ చట్టం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. "దేశంలోని పౌరులందరూ సామాజిక సామరస్యంతో జీవించే వాతావరణంలో భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 (CAA) వంటి చట్టాన్ని అమలు చేయడం ఆమోదయోగ్యం కాదు. తమిళనాడులో ఈ చట్టాన్ని అమలు చేయకూడదని డీఎంకే ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ అంశంపై ప్రజలకు హామీ ఇవ్వాలి" అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని తొలి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే కేంద్రం నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలపై వివక్ష చూపే ఈ చట్టాన్ని తాను అడ్డుకుంటానని హెచ్చరించారు. బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో సున్నిత అంశమైన ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలుచేయబోమని.. ఎన్నికల ముందు తాను అశాంతి కోరుకోవడం లేదని తెలిపారు.
ఇక పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని మతాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. ఈ చట్టం ముస్లింలను రెండో స్థాయి పౌరులుగా మారుస్తాయని.. దీన్ని రాష్ట్రంలో అమలు కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మతాల మధ్య విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు.
అలాగే ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాని దృష్టి మరల్చేందుకే సీఏఏ ప్రకటన చేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. సీఏఏ చట్టం ఆమోదం పొందిన తర్వాత నిబంధనల రూపకల్పనకే నాలుగేళ్ల 3 నెలల సమయం తీసుకున్నారని.. సరిగ్గా ఎన్నికల ముందు ఓట్లు దండుకోవడానికి ఇప్పుడు అమల్లోకి తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు. సీఏఏ నిబంధనలను ఐదేళ్లుగా పెండింగ్ పెట్టి ఎన్నికల ముందే ఎందుకు అమలు చేస్తున్నారని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com