Chiyaan Vikram:తంగలాన్ షూటింగ్‌లో ప్రమాదం.. చియాన్ విక్రమ్‌‌కు తీవ్రగాయాలు, ఆందోళనలో ఫ్యాన్స్

  • IndiaGlitz, [Wednesday,May 03 2023]

చియాన్ విక్రమ్.. విలక్షణ నటనకు, క్రమశిక్షణకు, అంకితభావానికి ఆయన పెట్టింది పేరు. పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడని తత్వమే విక్రమ్‌ను ప్రజలకు మరింత చేరువ చేసింది. అయితే షూటింగ్‌లో ఆయన పలుమార్లు అనుకోని ప్రమాదాల బారినపడ్డారు. తాజాగా విక్రమ్ తంగలాన్ షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో విక్రమ్ పక్కటెముక విరిగినట్లుగా తెలుస్తోంది. సర్జరీ అవసరమని వైద్యులు సూచించినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని విక్రమ్ పీఆర్ టీమ్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది.

ప్రమాదంపై విక్రమ్ టీమ్ ట్వీట్ :

‘‘ ప్రపంచం నలుమూలల నుంచి పీఎస్2పై చూపుతున్న ప్రేమ, ప్రశంసలకు ధన్యవాదాలు. మూవీ రిహార్సల్స్‌లో చియాన్ విక్రమ్‌కి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగిపోయింది. ఈ కారణం చేత విక్రమ్ కొంతకాలం పాటు ‘‘తంగలాన్’’ షూటింగ్‌కి హాజరుకాలేరు. వీలైనంత త్వరలోనే కోలుకుని ఆయన సెట్స్‌లో అడుగుపెడతారని’’ విక్రమ్ టీమ్ స్పష్టం చేసింది.

పీఎస్2 హిట్‌తో మంచి జోష్‌లో విక్రమ్ :

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొనియన్ సెల్వన్ 2 చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన .. బిజీగా గడిపారు. ఈ సినిమా రిలీజై సూపర్‌హిట్ కావడంతో విక్రమ్ మంచి జోష్‌లో వున్నారు. ఈ క్రమంలోనే ఆయన చెన్నైలో తంగలాన్ షూటింగ్స్‌కు హాజరయ్యారు. అక్కడ జరిగిన ప్రమాదంలో విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఈ వార్త తెలుసుకున్న విక్రమ్ అభిమానులు .. ఆయన కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు.

పా రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ :

కాగా.. పా రంజిత్, చియాన్ విక్రమ్‌ల కలయికలో తెరకెక్కుతోన్న తొలి చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గని కార్మికుల జీవితాల చుట్టూ తిరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. పశుపతి, హరికృష్ణన్ అన్బుదురై, ప్రీతి కరణ్, ముత్తుకుమార్‌లు సహాయక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.