త‌మ‌న్నా ఆ అవ‌కాశం ద‌క్కించుకుంటే..

  • IndiaGlitz, [Tuesday,May 08 2018]

‘శ్రీ’ (2005)  చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక తమన్నా. 2007లో విడుద‌లైన‌ ‘హ్యాపీడేస్’తో నాయిక‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే.. 2011లో వచ్చిన ‘100% లవ్’తో తమన్నా కెరీర్ గ్రాఫ్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఈ సినిమా అందించిన విజ‌యంతో.. ఈ తరంలో అగ్ర కథానాయకులైన పవన్ కల్యాణ్, మహేశ్ బాబు,  ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్,  అల్లు అర్జున్, రవితేజతో కలిసి నటించే అవ‌కాశాల్ని ఒక్కొక్క‌టిగా అందిపుచ్చుకుంది. ఇప్పుడు  ఇదే వ‌రుస‌లో.. సీనియర్ అగ్ర కథానాయకులతోనూ కలిసి నటించే అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటోంది త‌మ‌న్నా.

ఈ క్ర‌మంలో.. ఇప్పటికే నాగార్జునతో కలిసి నటించింది త‌మ‌న్నా. హీరోయిన్‌గా కాకపోయినా 2016లో వచ్చిన ‘ఊపిరి’ సినిమాలో నాగార్జునతో కలిసి స్క్రీన్‌ను పంచుకుంది.  ఇదే వరుసలో.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది ఈ మిల్కీ బ్యూటీ.  అంతేగాకుండా, తాజాగా.. వెంకటేష్‌కు జోడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్-2’లో కథానాయికగా ఎంపికైంది. ఇక ఈ అగ్ర కథానాయకులలో మిగిలింది ఒక్క‌ బాలకృష్ణ మాత్రమే. ఒక‌వేళ బాలయ్య‌తో కూడా కలిసి నటించే అవకాశం వస్తే.. రెండు తరాల అగ్ర హీరోలతో కలిసి నటించిన తొలి హీరోయిన్‌గా తమన్నా ఓ సెన్సేష‌న్‌ సృష్టిస్తుంది.