థియేటర్ల మూసివేత వుండదు.. టికెట్ రేట్లపై త్వరలోనే నిర్ణయం: టాలీవుడ్‌కు తలసాని హామీ
- IndiaGlitz, [Saturday,December 04 2021]
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోలు రద్దు చేయడంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించేలా చేసిన చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఏం చేయబోతోందా అన్న టెన్షన్ టాలీవుడ్ వర్గాలను వేధిస్తోంది. దీనిపై క్లారిటీ ఇచ్చారు ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న టికెట్ల ధరలపై అధ్యయనం చేసి ఎవరికీ నష్టం కలగని రీతిలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకుంటామని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం దిల్‌రాజు, డీవీవీ దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. కరోనా కొత్త వేరియంట్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రజలు ధైర్యంగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడొచ్చని .. అలాగే థియేటర్ల మూత, ఆక్యూపెన్సీపై ప్రచారాన్ని కూడా నమ్మవద్దని తలసాని పేర్కొన్నారు.
కరోనా దృష్ట్యా థియేటర్‌లపై ఆంక్షలు విధిస్తామన్న ప్రచారం అపోహేనని మంత్రి కొట్టిపారేశారు. కరోనా వల్ల రెండేళ్లుగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోందని... ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్ భయాలు మొదలయ్యాయని తలసాని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు. థియేటర్ ఆక్యుపెన్సీపై ఎలాంటి ఆంక్షలు లేవని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తమ ప్రభుత్వం 100శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇచ్చినా గత కొన్ని రోజులు ఆ స్థాయి ప్రేక్షకులు థియేటర్స్‌కు రావటం లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు.
బాలయ్య నటించిన ‘అఖండ’ విడుదలైన తర్వాత థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య కాస్త పెరిగిందని... త్వరలో భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నాయని మంత్రి చెప్పారు. థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోందని.. ఇలాంటి సమయంలో దర్శక-నిర్మాతలు అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు దాదాపు పూర్తయ్యాయని.. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయని మంత్రి గుర్తుచేశారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.