'సూపర్ స్కెచ్' సినిమా ఘనవిజయం సాధించాలి - తలసాని శ్రీనివాసయాదవ్
- IndiaGlitz, [Friday,April 06 2018]
ప్రతిభావంతులైన తెలుగు ఆర్టిస్టులు, విదేశీ ఆర్టిస్టులతో మంచి ప్రయోగంగా రూపొందించిన 'సూపర్ స్కెచ్' ఘన విజయం సాధించాలి. నాకు ఆప్తుడైన నర్సింగ్ ఇందులో హీరోగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న సినిమాలకు, మంచి సినిమాలకు అండగా నిలుస్తుంది అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.
రవిచావలి దర్శకత్వంలో శ్రీ శుక్ర క్రియేషన్స్ నిర్మిస్తోన్న చిత్రం 'సూపర్ స్కెచ్'. ఎరోస్ సినిమాస్ సమర్పణలో యూ అండ్ ఐ, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో తెరకెక్కుతోంది. బలరామ్ మక్కల నిర్మాత. నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్తా, కార్తిక్, చక్రి మాగంటి, అనిల్, శుభాంగి, సోఫియ (కాలిఫోర్నియా), గ్యారిటోన్ టోను (ఇంగ్లాండు) బంగార్రాజు, బాబా కీలక పాత్రధారులు. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో తలసాని శ్రీనివాసయాదవ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నర్సింగ్ మాట్లాడుతూ మొత్తం తెలంగాణ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ఈ సినిమా చేశాం. తెలంగాణ నేపథ్యానికి ప్రాధాన్యమిచ్చి తీసిన 'ఫిదా' లాంటి చిత్రాలు ఈ మధ్య కాలంలో సూపర్‌హిట్ అయ్యాయి. మా సినిమా ప్రతి ఫ్రేమ్‌లోనూ తెలంగాణ నేపథ్యం ఉంటుంది. తెలంగాణ ఆర్టిస్టులతో పాటు కాలిఫోర్నియాకు చెందిన సోఫియా, ఇంగ్లాండ్‌కు చెందిన గ్యారిటోన్ టోన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో నాది పోలీసాఫీసర్ పాత్ర. డైలాగులు కిర్రెక్కించే విధంగా ఉంటాయి అని తెలిపారు.
దర్శకుడు రవిచావలి మాట్లాడుతూ 'దృశ్యం' సినిమాలాగా మంచి థ్రిల్లర్ సినిమా ఇది. ఇతర భాషల్లో రీమేక్ అయ్యేంత సత్తా ఉంది ఈ కథలో. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం అని చెప్పారు.
ఇండియా - పాకిస్తాన్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగితే ఎంత ఉత్కంఠగా ఉంటుందో, ఈ సినిమా కూడా అంతే ఉత్కంఠగా ఉంటుందని నిర్మాత బలరామ్ మక్కల చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంద్ర, శుభాంగి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, కెమెరా: సురేందర్ రెడ్డి, ఎడిటింగ్: జునైద్.