సింగిల్ విండో విధానంలో సినిమా షూట్స్‌కు తలసాని గ్రీన్ సిగ్నల్
Send us your feedback to audioarticles@vaarta.com
సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. చాలా రోజులుగా ఈ విషయంపై సందిగ్ధత నెలకొనే ఉంది.. అయితే తాజాగా తలసాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం నాడు నగరంలోని మాసాబ్ట్యాంగ్లోని తన కార్యాలయంలో చలనచిత్రరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావనకు తెచ్చారు.
నిర్మాతలకు ఇబ్బందులు లేకుండా..!
‘సినిమా షూటింగ్‌ల అనుమతుల కోసం వివిధ శాఖల అధికారుల చుట్టూ రోజుల తరబడి తరగాల్సి వస్తోంది.. దీంతో ఎంతో సమయం వృధా అవుతోంది. నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎఫ్డీసీ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. వారం రోజుల్లో సింగిల్‌విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేలా చర్యలు అధికారులు తీసుకోవాలి. ఇప్పటికే షూటింగ్‌ల నిర్వహణకు అవసరమైన సమాచారాన్ని కొన్నిశాఖలు అందజేశాయి. మరికొన్నిశాఖలు ఇవ్వాల్సి ఉంది. వీలైనంత త్వరగా ఆయా శాఖల సమాచారం సేకరించాలి’ అని అధికారులను తలసాని ఆదేశించారు.
బస్టాండ్లలో మినీ థియేటర్స్!
‘రాష్ట్రంలో సుమారు 600 ధియేటర్లు ఉన్నాయి. వీటిలో ఎఫ్డిసి పోర్టల్ ద్వారా ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని కూడా వీలైనంత త్వరగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటాం. మరీ ముఖ్యంగా ఆన్లైన్ టికెటింగ్ విధానంతో అధిక ధరలకు టికెట్ల విక్రయాలను నియంత్రించవచ్చు. ఇది నిర్మాతకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధానం వల్ల ఎఫ్డీసీకి కూడా ఆదాయం వస్తుంది. అదే విధంగా ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి కూడా అవసరమైన చర్యలు అధికారులు తీసుకోవాలి’ అని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. కాగా.. ఈ సమావేశంలో ఎఫ్డీసీ సీఈవో కిషోర్‌బాబు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు మురళీమోహన్, కార్యదర్శి సునీల్‌నారంగ్, రాజ్‌తాడ్ల, నిర్మాతలు సి.కళ్యాణ్, ఠాగూర్ మధు, సుధాకర్‌రెడ్డి, అభిషేక్‌తో పాటు తదితరులు ఎఫ్డిసి అధికారులు, పలువురు సినీ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments