నూతన ఎన్నికల కమిషనర్ల బాధ్యతల స్వీకరణ.. ఎన్నికల షెడ్యూల్‌కు వేళాయే
Send us your feedback to audioarticles@vaarta.com
లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వెల్లడించేందుకు సమయం ఆసన్నమైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా నియమితులైన జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్‌లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. దీంతో వారికి సీఈసీ అభినందనలు తెలిపారు. వీరి బాధ్యతల స్వీకరణతో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయి సభ్యులతో నిండిపోయింది. కాగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుఖ్‌బీర్ సింగ్ ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఈ ఏడాది జనవరి 31న పదవి విరమణ చేశారు. అలాగే గతంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్‌గా పనిచేశారు. ఇక కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు.
గతంలో ఉన్న ఎన్నికల కమిషనర్లు అరుణ్ గోయాల్, అనూప్ చంద్ర పాండేలు రాజీనామాతో కమిషనర్ల పోస్టులు ఖాళీ అయ్యాయి. ఓవైపు ఎన్నికల సమయం దగ్గర పడటం, మరోవైపు కమిషనర్ల రాజీనామాతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన కేంద్రం కమిషనర్ల నియామకానికి ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని నియమించింది. అనంతరం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్, పంజాబ్‌కి చెందిన సుఖ్‌భీర్ సింగ్ సంధుని కమిషనర్లుగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెను వెంటనే వీరి పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపగా.. ఆమె తక్షణమే ఆమోద ముద్ర వేశారు.
నూతన ఈసీ కమిషనర్లు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది. ఇప్పటికే షెడ్యూల్ సిద్ధం చేసుకున్న సీఈసీ అధికారిక ప్రకటనకు రెడీ అయింది. ఈ రెండు రోజుల్లో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. ఈమేరకు రాష్ట్రాల ఎన్నికల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల కానుంది. మొత్తానికి యావత్ దేశమంతా ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments