వెంగయ్య ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్య తీసుకోండి: పవన్
- IndiaGlitz, [Sunday,January 24 2021]
జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్య తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. శనివారం మధ్యాహ్నం వెంగయ్య భార్య శ్రీమతి కేశవ నారాయణమ్మ, బిడ్డలు, సోదరుడితో కలిసి ఒంగోలులో జిల్లా ఎస్పీ కార్యాలయానికి పవన్ వెళ్లారు. ఈ మేరకు వెంగయ్య ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.
ప్రజల కోసం అభివృద్ధి గురించి అడిగిన యువకుడు ఆత్మహత్యకు కారకులైనవారిని తక్షణమే అరెస్టు చేయాలని పవన్ కల్యాణ్ కోరారు. జిల్లా ఎస్పీని కలిసి ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను వివరించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు దుర్భాషలాడటం, అధికార పార్టీ నేతల బెదిరింపుల గురించి వెల్లడించారు. వెంగయ్య కుటుంబ సభ్యులు సైతం తమకు ఎదురైన ఒత్తిళ్లను, కలిగిన క్షోభను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌కు వివరించారు.
సోషల్ మీడియా పోస్టుల పేరుతో వేధిస్తున్నారు
సింగరాయకొండలోని ఆలయ తోరణానికి సంబంధించిన విగ్రహాలకు అపచారం కలిగిన ఘటనపై వచ్చిన వార్తలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన జనసైనికులను నాన్ బెయిలబుల్ కేసులుపెట్టి అరెస్ట్ చేయడం భావ్యం కాదని పవన్..రు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. కేసులు ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లాలో జర్నలిస్టులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విధమైన అరెస్టులతో కార్యకర్తల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నాయని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.