కుర్చీ కోసం నిండు సభలో కొట్టుకున్న టి. కాంగ్రెస్ నేతలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బోర్డు చేసిన తప్పిదాలకు నిరసనగా గత కొన్ని రోజులుగా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసనలు, ఆందోళనతో రాష్ట్రవ్యాప్తంగా అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం నాడు మరోసారి ఇంటర్ బోర్డు తీరుకు నిరసనగా అఖిలపక్షాలు ధర్నాకు దిగాయి. ఇందిరాపార్క్ దగ్గర అఖిలపక్షాల నేతలు ధర్నాకు దిగారు. అయితే ఈ ధర్నాకు దొబ్బులాట.. కొట్లాటగా మారిపోయింది. నిండు సభలో కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు.. కుర్చీ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు, టీపీసీసీ సెక్రటరీ నగేష్ మధ్య చెలరేగిన వివాదం చివరకు కొట్టుకునేంత వరకు చేరింది.
అసలేం జరిగింది..?
అఖిల పక్షం ధర్నాకు వీహెచ్ వెళ్లారు. ఈ సమావేశంలో వీహెచ్ మాట్లాడుతున్న సమయంలో కుంతియా రావడం.. ఆయన ఆహ్వానించే సమయంలోనే కుర్చీల పంచాయతీ మొదలైంది. ఈ కార్యక్రమానికి వెళ్లిన వీహెచ్ ఓ కుర్చీలో కూర్చునే సమయంలో నగేష్.. ఆ కుర్చీని కుంతియా కోసం లాగేసుకున్నారు. వీహెచ్, నగేష్ మధ్య తోపులాట జరగడంతో.. నగేష్‌పై ఓ దశలో మైక్‌తో దాడి చేశారు వీహెచ్.. అనంతరం నగేష్ కిందకి లాగడంతో వీహెచ్ స్టేజీ పై నుంచి కింద పడిపోయారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వీహెచ్.. నా కుర్చీనే లాక్కుంటావా..? అంటూ వీరంగం సృష్టించారు. దీంతో నగేష్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆయన ఎదురు మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట కాస్త కొట్టుకునే దాకా వెళ్లింది. ఇద్దరి ఒకరినొకరూ తోసుకోగా అటు వీహెచ్.. ఇటు నగేశ్ ఇద్దరి కిందపడిపోయారు. అప్రమత్తమైన తోటి నేతలు వారిద్దర్ని పైకి లేపి.. కార్యక్రమం కొనసాగించారు.
సొంతపార్టీ నేతలపై ఆగ్రహం!
కాగా.. అంతకముందు గాంధీభవన్‌లో మీడియాతో జరిగిన సమావేశంలోనూ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన వీహెచ్ నేరుగా ఇందిరాపార్క్ దగ్గరకు చేరుకున్నారు. గాంధీభవన్‌లో ఉదయం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ జరిగింది. సమావేశంలో నేతలపై వీహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "పార్టీలో కొత్త వారికి ప్రాధాన్యత ఇచ్చి పాత వారిని విస్మరిస్తే ఎలా?. కాసాని జ్ఞానేశ్వర్, ఆర్.కృష్ణయ్యకి ఏ ప్రతిపాదికన టికెట్ ఇచ్చారు?. ఆకుల లలితకి ఎమ్మెల్సీ ఉండగానే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చారు? టికెట్ ఇచ్చినా ఆమె పార్టీ మారిపోయింది. నాంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఫైరోజ్ఖాన్కు హైదరాబాద్ ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు?" అని సొంత పార్టీ నేతలపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీహెచ్ వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలు ఒకింత కంగుతిన్నారు. పార్టీలో అసలేం జరుగుతోందో తెలియక నివ్వెరపోతున్నారు. సో.. మొత్తానికి చూస్తే ఇప్పుడే అంతంతమాత్రం ఉన్న కాంగ్రెస్‌కు ఇలా నేతలు ఎదురుదాడి చేస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout