పాట చిత్రీకరణలోనూ సైరా రికార్డ్
- IndiaGlitz, [Friday,September 27 2019]
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. చిరు 151వ చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న తెలుగు,హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా భారీ రేంజ్లో విడుదలవుతుంది. చిరుతో పాటు అమితాబ్, నయనతార, తమన్నా, అనుష్క, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ .. తదితర భారీ తారాగణంతో రూపొందిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో నిర్మాత రామ్‌చరణ్ సినిమాను అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. ప్రతి సీన్‌ను ఎంతో విజువల్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాలో జాతర సాంగ్‌ను చాలా గ్రాండియర్‌గా తెరకెక్కించారట. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ పాటలో 4500 మంది ఆర్టిస్టులు నటించారట. 14 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారట. ఇంత పెద్ద రేంజ్లో చిత్రీకరించిన పాట ఇప్పటి వరకు ఇదేనని వార్తలు వినపడుతున్నాయి.
ప్యాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ సినిమాశాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయట. ప్రపంచమంతటా 3800 స్క్రీన్స్‌లో విడుదలవుతున్న చిత్రమిది. ఈ సినిమా కోసం 3800 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్‌ను ఉపయోగించారట. మరో నాలుగు రోజుల్లో మెగాభిమానులు నిరీక్షణకు తెరపడనుంది.