'ఈ యుద్ధం ఎవరిది?'... సైరా
- IndiaGlitz, [Tuesday,August 21 2018]
భారతదేశపు తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి. పాలెగాడు నరసింహారెడ్డి కథతో గత ఏడాది చిరంజీవి మొదలుపెట్టిన సినిమా 'సైరా నరసింహారెడ్డి'. బుధవారం ఆయన పుట్టినరోజు.
ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. శ్రీమతి సురేఖ సమర్పణలో, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ఇది. మంగళవారం విడుదలైన టీజర్ ఏరియల్ వ్యూతో మొదలవుతుంది. బ్రిటిష్ అహంకారాన్ని తొలి షాట్స్ లో చూపించారు. పైన బ్రిటిష్ పతాకం రెపరెపలు, కారులో నుంచి మన వారి వీపుపై కాలుపెట్టి దిగిన తెల్లదొరలతో టీజర్ మొదలైంది. ఎరుపు రంగు జండాను పట్టుకుని నిలబడ్డ సైరా నరసింహారెడ్డి రాజసం మెప్పిస్తుంది. కోటను కూడా అద్భుతంగా చూపించారు. ఈ యుద్ధం ఎవరిది అని నరసింహారెడ్డి అడగ్గా మనది అనివేలాది మంది గొంతుకలిచ్చిన తీరు గగుర్పాటుగా అనిపిస్తుంది.
భారీ గ్రాఫిక్స్, భారీ వ్యయంతో... మరో బాహుబలిని తలపించే సినిమాగా, రిచ్‌గా తీసినట్టు అర్థమవుతోంది. చిరంజీవి లుక్స్, గెటప్, గుర్రపు స్వారీ అభిమానులకు పక్కా ట్రీట్ అనడంలో అనుమానం లేదు. 2019 వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాదాపు రూ.200కోట్ల వ్యయంతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.