Download App

Sye Raa Narasimha Reddy Review

మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలోకి `ఖైదీ నంబ‌ర్ 150`తో రీ ఎంట్రీ ఇచ్చి భారీ హిట్‌ను సొంతం చేసుకున్నారు. త‌ర్వాత ఆయ‌నే ఏ సినిమా చేస్తార‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ పెరిగింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రాన్ని ప్ర‌క‌టించారు. `బాహుబ‌లి` ఇచ్చిన ధైర్యంతో సైరాను చేయ‌డానికి చిరంజీవి సిద్ధ‌మ‌య్యారు. హీరో రామ్‌చ‌ర‌ణ్ మ‌రోసారి నిర్మాత‌గా మారి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సినిమాను భారీ స్కేల్‌లో నిర్మించ‌డం, అమితాబ్ బచ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, అనుష్క .. ఇలా ప్యాన్ ఇండియా  స్టార్స్ అంద‌రూ ఈ చిత్రంలో న‌టించారు. భారీ బ‌డ్జెట్‌, భారీ స్టార్ కాస్ట్‌తో చేసిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ప్యాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సినిమాను సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రేనాటి ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ `సైరా న‌ర‌సింహారెడ్డి` ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ‌:

నొస్సం ప్రాంతానికి చెందిన పాలెగాడు(నాజ‌ర్‌) త‌న కూతురుకి పుట్టిన సంతానంలో చివ‌రివాడైన‌ న‌ర‌సింహారెడ్డి(చిరంజీవి)ని ద‌త్త‌త తీసుకుంటాడు. బ్రిటీష్‌వారు మ‌న‌వారిపై చేస్తున్న అన్యాయాల‌ను చూస్తూ పెరిగిన న‌ర‌సింహారెడ్డి వారికి ఎదురు తిర‌గాల‌నుకుంటాడు. గురువు గోసాయి ఎంక్న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో పెరిగి పెద్ద‌యిన న‌ర‌సింహారెడ్డి త‌న రేనాటి ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ‌తాడు. క‌రువు వ‌చ్చిన ప‌న్నులు క‌ట్టాల్సిందేన‌ని బ్రిటీష్ దొర‌లు ఆదేశిస్తారు. అయితే తాము ప‌న్నులు క‌ట్ట‌మ‌ని న‌ర‌సింహారెడ్డి తెగేసి చెప్పేస్తాడు. దాంతో బ్రిటీష్ అధికారి న‌ర‌సింహారెడ్డి లేని స‌మ‌యంలో అక్క‌డి ప్ర‌జ‌ల్లో కొంత మందిని చంపేసి వెళ్లిపోతాడు. విష‌యం తెలుసుకున్న న‌ర‌సింహారెడ్డి ఉగ్ర న‌రసింహుడిగా మారి ఆ బ్రిటీష్ అధికారిని చంపేస్తాడు. అక్క‌డ నుండి పోరాటం మొద‌ల‌వుతుంది. నొస్సం కోట‌పై దాడికి వచ్చిన బ్రిటీష్ అధికారుల‌ను కూడా న‌ర‌సింహారెడ్డి అవుకు రాజు సాయంతో చంపేస్తాడు. క్ర‌మంగా న‌ర‌సింహారెడ్డికి రాజా పాండి, పాపా ఖాన్‌, వీరా రెడ్డి త‌దిత‌రులు తోడ‌వుతారు. ఉద్య‌మాన్ని ప్ర‌జా ఉద్య‌మంగా.. అక్క‌డి నుండి యుద్ధంగా మార్చేస్తారు. బ్రిటీష్‌వారు వేసే ఎత్తుల‌కు న‌ర‌సింహారెడ్డి పై ఎత్తులు వేస్తూ వ‌స్తాడు. ఉద్య‌మాన్ని అణ‌చ‌డంలో విఫ‌ల‌మైతే యుద్ధం పెరిగి పెద్ద‌ద‌వుతుంద‌ని భావించిన తెల్ల‌దొర‌లు ఓ ప‌న్నాగం ప‌న్నుతారు. ఆ ప‌న్నాగం ఏంటి?  న‌సింహారెడ్డిని బ్రిటీష్‌వారు ఏం చేశారు?  న‌ర‌సింహారెడ్డి భార్య సిద్ధ‌మ్మ‌, ప్రియ‌రాలు ల‌క్ష్మి ఏమ‌వుతారు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..  

ప్ల‌స్ పాయింట్స్‌:

- చిరంజీవి ఇత‌ర న‌టీన‌టుల న‌ట‌న‌
- సినిమాటోగ్ర‌ఫీ
- వి.ఎఫ్‌.ఎక్స్‌
- బ్యాగ్రౌండ్ స్కోర్
- డైలాగ్స్‌
- యాక్ష‌న్ సీన్స్

మైన‌స్ పాయింట్స్‌:

- ఫ‌స్టాఫ్ డ్రాగింగ్‌గా అనిపిస్తుంది
- పాలెగాడు చేసే పోరాటాల‌ను యుద్ధాల రేంజ్‌లో ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు

సమీక్ష‌:

మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్  సినిమాల‌కు భిన్నంగా 151వ చిత్రంగా హిస్టారిక‌ల్ చిత్రం ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రినీ థ్రిల్ చేశారు. క‌మ్రంగా సినిమాలో అమితాబ్‌, విజయ్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, అనుష్క‌, ర‌వికిష‌న్‌, జ‌గ‌ప‌తిబాబు వంటి స్టార్స్ జాయిన్ కావ‌డంతో సినిమాపై అంచాలు పెరిగాయి. ఈ అంచ‌నాల‌కు ధీటుగానే సినిమాను నిర్మించారు రామ్‌చ‌ర‌ణ్‌. ప్రొడ‌క్ష‌న్ విష‌యంలో పెట్టిన ఖ‌ర్చు తెర‌పై ప్ర‌స్పుటంగా క‌న‌ప‌డుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి విష‌యానికి వ‌స్తే.. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ ఆయ‌న ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌న‌ప‌డింది. ముఖ్యంగా ఆరుప‌దుల వ‌య‌సు దాటిన‌ ఆయ‌న చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాలు చూసి అంద‌రూ షాక‌వ‌డం ఖాయం. డైలాగ్స్ కూడా సంద‌ర్భాను చితంగా స‌న్నివేశాల స్థాయిని పెంచాయి. గోసా ఎంక‌న్న పాత్ర‌లో అమితాబ్‌, రాజా పాండిగా విజయ్ సేతుప‌తి, అవుకు రాజుగా కిచ్చా సుదీప్‌, సిద్ధ‌మ్మగా న‌య‌న‌తార‌, ల‌క్ష్మి పాత్ర‌లో త‌మ‌న్నా, వీరా రెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు, ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ పాత్ర‌లో నిహారిక ఇలా ప్ర‌తి పాత్ర‌కు జ‌స్టిఫికేష‌న్ ఇచ్చేలా సినిమాను అందంగా తీర్చిదిద్దారు. ఇద్ద‌రు హీరోయిన్స్‌లో త‌మ‌న్నా పాత్ర‌కు మంచి స్కోప్ ద‌క్కింది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, అనుష్క గెస్ట్ రోల్స్‌లో మెప్పించారు. ప్ర‌తి పాత్ర‌ధారుడు త‌మ పాత్ర‌కు వంద‌శాతం న్యాయం చేశారు. ఇక ముఖేష్ రుషి, ర‌ఘుబాబు, బ్ర‌హ్మాజీ, థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ, సాయిచంద్ ఇలా ఇత‌ర పాత్ర ధారులు చ‌క్క‌గా న‌టించారు.

ఇక సాంకేతికంగా చూస్తే.. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డిని త‌ప్ప‌కుండా అభినందించాల్సిందే. సినిమాను చ‌క్క‌గా చ‌క్క‌గా విజ‌న‌రీతో తెర‌కెక్కించిన‌ట్లు క‌న‌ప‌డుతుంది. ఎక్క‌డా క‌థ‌లో తొట్రుపాటు క‌న‌ప‌డ‌దు. ఎక్క‌డ సినిమాటిక్ లిబ‌ర్టీ తీసుకోవాలో అక్క‌డ లిబ‌ర్టీని తీసుకుంటూ సినిమా ఆస‌క్తిక‌రంగా మ‌లిచాడు. అయితే ఫ‌స్టాఫ్ స‌న్నివేశాలు కాస్త సాగ‌దీసిన‌ట్లు అనిపిస్తాయి. ఇంట‌ర్వెల్ సీన్ నుండి సినిమాలో స్పీడు క‌న‌ప‌డుతుంది. ఎమోష‌న‌ల్ సీన్స్ అన్నీ క‌నెక్టింగ్‌గా ఉన్నాయి. సాయిమాధ‌వ్ బుర్రా మాట‌లు చ‌క్క‌గా ఉన్నాయి. ఎమోష‌న‌ల్ సీన్స్‌కు అతికిన‌ట్లు స‌రిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్ స‌న్నివేశంలో డైలాగ్స్ కీల‌క భూమిక‌ను పోషించాయి. అమిత్ త్రివేది అందించిన పాట‌ల్లోటైటిల్ సాంగ్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. జూలియ‌స్ పేకియం బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్బ్‌, వి.ఎఫ్‌.ఎక్స్ స‌న్నివేశాలు బావున్నాయి. గ్రెగ్ పావెల్‌, లీ విట్టెక‌ర్, రామ్ ల‌క్ష్మణ్ యాక్ష‌న్ పార్ట్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. రాజీవ‌న్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ బావుంది. కాస్ట్యూమ్స్ అన్నీ చ‌క్క‌గా ఉన్నాయి.

బోట‌మ్ లైన్‌:  తెలుగువాడి పౌరుషాన్ని చాటిన సైరా న‌రసింహారెడ్డి

Read Sye Raa Narasimha Reddy Review in English

Rating : 3.3 / 5.0