Varsha Bollamma: స్వాతిముత్యం సహజంగా,చాలా బాగుంటుంది: వర్ష బొల్లమ్మ
- IndiaGlitz, [Monday,October 03 2022]
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం 'స్వాతిముత్యం'. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విభిన్న కథాంశంతో వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర కథానాయిక వర్ష బొల్లమ్మ విలేఖర్లతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సినిమాలో హీరోని మీరు డామినేట్ చేశారా? లేక మిమ్మల్ని ఆయన డామినేట్ చేశారా?
సినిమాలో పాత్రల పరంగా చూస్తే నా పాత్ర కొంచెం డామినేటింగ్ గా ఉంటుంది. గణేష్ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. నేను పోషించిన భాగ్య లక్ష్మి పాత్ర ఒక స్కూల్ టీచర్. ఆ పాత్రకు తగ్గట్లు కొంచెం పెత్తనం చూపిస్తాను.
ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం?
నిజాయితీగా చెప్పాలంటే ఇది మొదట సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా అని చెప్పారు. ఆ తర్వాత కథ చెప్పారు. సితార లాంటి పెద్ద సంస్థలో అవకాశం అనగానే చేయాలనుకున్నాను. అయితే కథ విన్నాక చాలా నచ్చింది. సినిమా ఖచ్చితంగా చేయాలి అనిపించింది.
ఈ కథలో మీకు నచ్చిన అంశాలు ఏంటి?
నాకు ఇలా సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు అంటే ఇష్టం. ఈ కథలో కొత్తదనం ఉంది. పాత్రలలో చాలా లోతు ఉంది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి.
మీ నిజ జీవితానికి ఈ పాత్ర దగ్గరగా ఉందా?
అవును. నేను ఒక చిన్న టౌన్ నుండి వచ్చాను. అక్కడ ఎలా ఉంటుంది అంటే ఏదైనా చిన్నది జరిగినా పెద్దది చేసి మాట్లాడతారు. మన బంధువుల కుటుంబంలో ఏదైనా జరిగితే మన మాట్లాడుకుంటాం కదా.. అలా ఒక సాధారణ కుటుంబంలో జరిగే సన్నివేశాలు ఉంటాయి.
ఇందులో టీచర్ పాత్ర చేశారు కదా.. దానికోసం మీ స్కూల్ టీచర్ ని ఎవరినైనా స్పూర్తిగా తీసుకున్నారా?
మా టీచర్లు అందరికీ ముందు పెళ్ళైపోయింది(నవ్వుతూ). పాత్ర స్వభావం ఎలా ఉంటుందంటే బయట సరదాగా ఉంటాను కానీ పిల్లల ముందు మాత్రం కాస్త కఠినంగా ఉంటాను. నిజ జీవితంలో నాకు పిల్లలు అరిస్తే ఇష్టం. అలాగే నాకు నిజ జీవితంలో చాలా మంచి గురువులు దొరికారు. వాళ్ళ స్పూర్తితో సినిమాలో సహజంగా చేశాను.
విక్కీ డోనార్ చిత్రం తో స్వాతిముత్యం కు పోలిక ఏమైనా ఉందా..? చిత్రంలో ఏదైనా కొత్తగా చూపిస్తున్నారా?
కథాంశం పోలిక మాత్రమే ఒకటి. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. కథనం భిన్నంగా సాగుతుంది. ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా కొత్తగా ఉంటుంది.
ఎక్కువగా యువ హీరోలతో(ఆనంద్ దేవరకొండ, గణేష్ బెల్లంకొండ) నటించడం ఎలా ఉంది?
చాలా మంది అడుగుతుంటారు. ఎక్కువగా హీరోల సోదరులతో చేస్తారు ఎందుకు అని. నేను కావాలని ఎంపిక చేసుకోలేదు. అది అలా కుదురుతుంది అంతే. ఇప్పుడు వస్తున్న యువ హీరోలు మంచి సబ్జెక్టులతో వస్తున్నారు. నన్ను తీసుకోవడానికి అది కూడా కారణమై ఉండొచ్చు.
గణేష్ కి ఇది మొదటి సినిమా కదా.. సీనియర్ గా ఏమైనా సలహాలు ఇచ్చారా?
నేను కూడా అలాగే అనుకొని సెట్ లో అడుగు పెట్టాను. కానీ వాళ్ళ కుటుంబం ముందు నుంచి సినిమా రంగంలో ఉంది కాబట్టి గణేష్ కి ముందే ఇక్కడ ఎలా ఉంటుందని అవగాహన ఉంది. అందుకే ఇది అతనికి మొదటి సినిమాలా అనిపించలేదు.
మీరు ఎక్కువగా మధ్యతరగతికి చెందిన పాత్రలే చేస్తున్నారు. మీరు ఎంచుకుంటున్నారా? లేక అలాంటి పాత్రలే వస్తున్నాయా?
అలా ఏం లేదు. నేను తెలుగులో చేసిన మొదటి సినిమా చూసీ చూడంగానే. అందులో నేను డ్రమ్మర్ గా చేశాను. నేను అన్ని పాత్రలు చేస్తాను. కానీ నన్ను ప్రేక్షకులు మధ్యతరగతి అమ్మాయిగా చూడటానికి ఇష్టపడుతున్నారు అనుకుంటా. ఈ అమ్మాయి మన పక్కింటి అమ్మాయిలా ఉందని వాళ్ళు అనుకోవడం వల్ల అలాంటి పాత్రలు నాకు ఎక్కువ పేరు తీసుకొస్తున్నాయి.
మీ డ్రీమ్ రోల్ ఏంటి?
ఈ అమ్మాయి ఇలాంటి పాత్ర కూడా చేస్తుందా అని అనుకునే లాంటి పాత్ర చేయాలని ఉంది. ప్రతినాయిక ఛాయలు ఉన్న సైకో పాత్ర దొరికితే బాగా చేయగలనని నాకు నమ్మకం ఉంది.
దర్శకుడు లక్ష్మణ్ గురించి చెప్పండి?
చిన్న టౌన్ నుంచి వచ్చిన వారిలో కాస్త అమాయకత్వం ఉంటుంది. అది ఆయనలోనూ, ఆయన రచనలోనూ కనిపిస్తుంది. ఆయన రచన నాకు చాలా నచ్చింది. ఆయనకు చాలా స్పష్టత ఉంటుంది.
టాప్ హీరోయిన్ అవ్వాలని అందరికీ ఉంటుంది.. ఆ దిశగా మీరు ప్రయత్నిస్తున్నారా?
ఆ ఆలోచన లేదండి. నటిగా మంచి పేరు తెచ్చుకావాలని ఉంది అంతే. కమర్షియల్ సినిమాలలోనైనా నటనా ప్రాధాన్యమున్న పాత్రలు వస్తే చేస్తాను.
సితార సంస్థ గురించి చెప్తారా?
ఆ బ్యానర్ లో పని చేయాలని అందరికీ ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ గౌరవం ఇస్తారు. మేకప్ మ్యాన్, లైట్ బాయ్ ఇలా అందరికీ వెంటనే డబ్బులు ఇస్తారు. నేను సినిమా చేయకముందే సితార గురించి గొప్పగా విన్నాను. సినిమా చేస్తున్నప్పుడు అది నిజమని అర్థమైంది. సితార లో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది.
ప్రస్తుతం ఏయే భాషల్లో సినిమాలు చేస్తున్నారు?
తెలుగుతో పాటు తమింలోనూ చేస్తున్నాను. అయితే ఎక్కువగా తెలుగు సినిమాల మీదే దృష్టి పెడుతున్నాను. అలాగే అవకాశమొస్తే కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ చేస్తాను.
మీ అభిమాన నటులు ఎవరు?
చాలామంది ఉన్నారు. ఇటీవల ఆర్ ఆర్ ఆర్ లో కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ గారి నటన చాలా నచ్చింది. ఆయన నటనకు నేను పెద్ద అభిమానిని.