'త్రిపుర' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని సినిమాలకు క్రేజ్ వస్తుంది. ఆ క్రేజ్ సినిమా మీద ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ తెచ్చేస్తుంది. త్రిపురకు కూడా విడుదలకు ముందు మరింత క్రేజ్ వచ్చింది. త్రిపుర పాత్రలో స్వాతి నటించడం వల్ల కావచ్చు. గీతాంజలి సినిమా తీసిన దర్శకుడు తీస్తున్న మరో సినిమా అనీ కావచ్చు. కోన వెంకట్, వెలిగొండ చేసిన స్క్రీన్‌ప్లే వల్లా కావచ్చు. ఏదేతేనేం... త్రిపుర సినిమాకు విడుదలకు ముందు మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. ఆ బజ్‌ను త్రిపుర క్యాష్ చేసుకుందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే చదవండి.
కథ
త్రిపుర (స్వాతి) పల్లెటూరి అమ్మాయి. తను కనే కలలు నిజమవుతుంటాయి. దాంతో హైదరాబాద్‌లో తన పిన్ని ఇంట్లో ఉంటూ డాక్టరుకు చూపించుకుంటుంటుంది. అలా ఓ సారి వైద్యం కోసం వెళ్లినప్పుడు నవీన్ (నవీన్ చంద్ర) పరిచయమవుతాడు. తనతో లిప్‌లాక్ చేసినట్టు కల్లో కొచ్చే కుర్రాడు నవీనేనని స్వాతికి అర్థమవుతుంది. అతనితో ప్రేమలో పడుతుంది. ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. నవీన్ కి చెందిన ఫామ్‌హౌస్ అమ్మడంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. అందులో భాగంగా నెల రోజులు ఆ ఫామ్ హౌస్‌లో గడపడానికి వెళ్తారు నూతన దంపతులు. ఆ క్రమంలో ఏం జరిగింది. అంతకు ముందు రాత్రిపూట ఆ ఇంటికి వచ్చిన ఈషా ఏమైంది? ఈషా అన్నయ్య అని పిలిచిన పోలీసాఫీసర్ తన ఇన్వెస్టిగేషన్‌లో సక్సెస్ అయ్యాడా? ఈషాను ఆ ఇంట్లో దింపిన ఆటోడ్రైవర్‌కి దొరికిన క్లూ ఏంటి? సినిమాల్లో చేరదామని త్రిపుర ఇంటికి వచ్చిన వారికి ఏమైంది? త‌్రిపుర మామ సప్తగిరి చివరికి ఏమయ్యాడు? వంటివన్నీ ఆసక్తికరమైన విషయాలు.
ప్లస్ పాయింట్లు
త్రిపుర అనే టైటిల్ సినిమాకు చాలా ప్లస్. స్వాతి దెయ్యంగా నటిస్తుందని వచ్చిన వార్త ప్లస్. ప్రీ రిలీజ్ బజ్ కూడా పాజిటివ్‌గా ఉండటం ప్లస్ అయింది. ఇల్లాలి పాత్రలో స్వాతి చూడ్డానికి బావుంది. నవీన్ చంద్ర గడ్డంతో లవర్‌బోయ్‌గా బావున్నాడు. పెళ్ళి పాట బావుంది. నవీన్, స్వాతి లిప్‌లాక్‌ను యువజంటలు ఎంజాయ్ చేస్తాయి. త్రిపురకు చెందిన పల్లెటూరు... చూడ్డానికి చాలా గ్రీనరీగా ఉంది. రీరికార్డింగ్ అక్కడక్కడా బావుంది. ఫామ్‌హౌస్ చూడ్డానికి బావుంది. హంపి , బాదామి లొకేషన్లు ప్రత్యేకంగా కనిపించాయి. రావు రమేష్ ప్రొఫెసర్ పాత్రలో సస్పెన్స్ ను మెయింటెయిన్ చేస్తూ చక్కగా నటించారు. నవీన్‌చంద్ర యాజ్ యూజువల్ చక్కగా నటించారు. అమ్మాయిలను ఆకట్టుకునే పాత్రలో మరోసారి కనిపించారు. స్వాతి లుక్స్ బావున్నాయి. ప్రీతీ నిగమ్ తనకిచ్చిన పాత్రను బాగా చేసింది. జయప్రకాష్ రెడ్డి, షకలకశంకర్ తండ్రీ కొడుకులుగా మెప్పించారు. తనదైన శైలిలో సప్తగిరి మాటలతో మెప్పించే ప్రయత్నం చేశాడు. ధనరాజ్ కనిపించినంత సేపూ ఆహ్లాదకరంగా అనిపించింది.
మైనస్ పాయింట్లు
సినిమా ఎక్కడా ఆసక్తికరంగా అనిపించదు. సినిమాకున్న అత్యంత పెద్ద మైనస్ పాయింట్ అదే. సినిమాలో సీను తర్వాత సీను కనిపిస్తుందే తప్ప ఎక్కడా కాస్త ఆగి చూడాలని అనిపించదు. శివన్నారాయణ సినిమాలో చూడటానికి ఎంత చిరాగ్గా ఉంటాడో, ఆయన కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుడికీ విసుగు పుడుతుంది. రజిత మంచి చీరల్లో అలా షోకేసు బొమ్మలా కనిపిస్తుంది. పాటలు ఆకట్టుకోవు. వాటిని చిత్రీకరించిన విధానం కూడా బావుండదు. పెద్దగా మెప్పించదు. సినిమా నీరసంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. సప్తగిరి మాటలు బలవంతంగా నవ్వించే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తాయి. కెమెరా పనితనాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గట్టు ఏమీ ఉండదు. ఎక్కడా భయపెట్టదు. పోనీ త్రిపురకు వస్తున్న కలలను గురించి ఎవరూ దిగులుపడుతున్నట్టు కూడా అనిపించదు. తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని తెలిస్తే స్త్రీ ఊరుకోలేదు. అయినా త్రిపుర ఊరుకోగలుగుతుంది. తన ప్రాణానికి భర్త వల్ల ప్రమాదం ఉందనుకున్నప్పుడు మాత్రం ఎదురుతిరిగి అతన్ని గాయపరిచే ప్రయత్నం చేస్తుంది. త్రిపురకు వచ్చే కలలను గురించి రావు రమేష్ చేసే విశ్లేషణ పెద్దగా మెప్పించదు.
విశ్లేషణ
గీతాంజలి సినిమాతో దర్శకుడు రాజకిరణ్ కు ఓ మంచి పేరు వచ్చింది. దర్శకుడిగా హారర్ సినిమాలను చక్కగా డీల్ చేయగలుగుతున్నాడనే పేరు వచ్చింది. ఆ పేరుతో త్రిపురను పట్టాలెక్కించగలిగారు. తొలి సినిమా ఇచ్చిన విజయం తాలూకు నమ్మకం ఈ సినిమాను తీసే విధంగా అతన్ని నడిపించింది. అయితే ఈ సినిమాను గీతాంజలిలాగా ఆసక్తికరంగా తెరకెక్కించగలిగారా? అంటే పూర్తిగా చేయలేకపోయారనే చెప్పాలి. ఈ సినిమా టైటిల్ రోల్లో స్వాతి చేసిందే తప్ప త్రిపురగా ఆమె సినిమాలో భయపెట్టే పోర్షన్ కూడా పెద్దగా లేదు. పోనీ భయపడే పోర్షన్ కూడా పెద్దగా లేదు. సగటు గృహిణిగా తనకిచ్చిన పాత్రలో చేసింది. ఒక ఫామ్ హౌస్, అందులో ఏదో ఘటన జరగడం, పనిమనిషి భయపెట్టే చూపులతో కనిపించడం వంటివన్నీ ఇతర హారర్ సినిమాల్లో మామూలుగా జరిగేవే. ఈ సినిమాలో కలలు అనే ఒక ప్రత్యేకతను జోడించారు. అయితే దాన్ని కూడా ఇంటెన్సిటీతో, నైల్ బైటింగ్ షాట్స్ తో చెప్పడంతో పూర్తిగా సఫలం కాలేకపోయారన్నది నిజం.
బాటమ్ లైన్: అనాసక్తకరంగా సాగిన త్రిపుర
రేటింగ్: 2.25/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments