ఆ విషయం నాకు ఇప్పటికీ అర్ధం కాదు - స్వాతి
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లరి చూపులు, ఆకట్టుకొనే అందం, అలరించే మాటలు.. అన్నిటినీ మించి అందరితోనూ కలివిడిగా కలిసిపోయే హుందాతనం ఆమె సొంతం. బుల్లితెరపై ఆమె చేసిన హంగామా చూసి తెలుగు పరిశ్రమ మాత్రమే కాదు.. యావత్ దక్షిణ భారత సినిమా ప్రపంచం ఆశ్చర్యపోయింది, ఆమెను అక్కున చేర్చుకొంది. ఆ నటి పేరు స్వాతి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కథానాయికగా గుర్తింపు తెచ్చుకొన్న స్వాతి నటిస్తున్న తాజా చిత్రం "త్రిపుర". నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తున్న "త్రిపుర" సినిమా గురించి, ఆ సినిమాలో తన పాత్ర గురించి, తన భవిష్యత్ ప్రణాళికల గురించి స్వాతి చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే..!!
అమాయకపు పల్లెటూరి పిల్లను..
"త్రిపుర" సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిగా నటించాను. అల్లరికి చిలిపితనం కలిపితే ఎలా ఉంటుందో, నా పాత్ర స్వభావం కూడా అదే విధంగా ఉంటుంది. నా పాత్ర పేరు "త్రిపుర". ఆమెకు వచ్చే కలలు యాదృచికంగా నిజం అవుతుంటాయి. చక్కగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని భర్తతో సుఖంగా జీవిస్తుంటుంది. అలాంటి సమయంలో ఆమెకు వచ్చిన ఒక కల ఆమె జీవితాన్ని ఏ విధంగా మార్చింది అనేది చిత్ర కథాంశం.
మరీ చిన్నపీల్లలా ఉండకూడదని..
"గోల్కొండ హై స్కూల్" సినిమాలో నేను చీర కడితే.. "అస్సలు సూట్ అవ్వలేదు, మరీ చిన్న పిల్లలా ఉన్నావు" అంటూ చాలా మంది కామెంట్ చేసారు. అందుకే కొంచెం బరువు పెరిగాను. "త్రిపుర" సినిమాలో దాదాపుగా చీరల్లోనే కనిపిస్తాను. ఒక సాధారణ గృహిణి నిజజీవతంలో ఎలా ఉంటుందో అదే విధంగా కనిపించడానికి ప్రయత్నించాను.
ఇది దెయ్యం సినిమా కాదు..
"త్రిపుర" దెయ్యం సినిమా కాదు. ఇది ఒక థ్రిల్లర్. సినిమాలో మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో నేను "దెయ్యం"గా కనిపిస్తానని కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. అవన్నీ నిజం కావు.
అప్పట్లో పీడ కలలు కనేదాన్ని..
నిజజీవితంలో నేను పెద్దగా కలలు కనను. అయితే.. చిన్నప్పుడు కాలేజ్ లో నాకు స్కాలర్ షిప్ వచ్చినప్పుడు,.. ఎక్కడ నన్ను అమెరికా పంపించేస్తారో అన్న భయంతో.. నన్ను నిజంగానే అమెరికా పంపేసినట్లు పీడ కలలు కనేదాన్ని. అయితే నేను కలల్ని నమ్మే వ్యక్తిని కాదు. విధిని నమ్ముతాను.
మా డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్..
మా "త్రిపుర" డైరెక్టర్ రాజ్ కిరణ్ ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నారు. అందువల్ల చిత్ర పరిశ్రమలో పలు విభిన్నమైన శాఖల్లో పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఒక్కోసారి ఆయన చెప్పే విషయాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఆయన ఒక దెయ్యంతో 3 నెలలపాటు సావాసం చేసారట. సినిమా అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తీ ఆయన. "త్రిపుర" సినిమాని చాలా బాగా తెరకెక్కించారు.
బిల్డప్ ఇస్తున్నాడు అనుకొన్నాను..
నవీన్ చంద్రను ఫస్ట్ డే సెట్స్ లో చూసినప్పుడు చాలా సైలెంట్ గా కూర్చున్నాడు. మొదటిరోజు కదా బిల్డప్ ఇస్తున్నాడు అనుకొన్నాను. కానీ సినిమా పూర్తయ్యేంతవరకూ తన నడవడిక మారలేదు. అప్పుడు అనిపించింది.. "ఈ అబ్బాయ్ నిజంగానే చాలా సైలెంట్ అండ్ డీసెంట్" అని.
ఆ విషయం వాళ్లకే తెలియాలి..
"తెలుగమ్మాయి అయ్యుండి తెలుగులో ఎక్కువ సినిమాలు ఎందుకు చేయవు" అని అడుగుతుంటారు. ఆ విషయం నన్ను అడగడం కంటే మన తెలుగు సినిమా దర్శకుల్ని, నిర్మాతల్ని అడగడం సబబు అని నా భావన. అయితే.. ఆ ప్రశ్న నన్ను కూడా అప్పుడప్పుడూ తొలిచేస్తూ ఉంటుంది. కానీ ఆ విషయం ఎంత ఆలోచించినా నాకైతే అర్ధం కాలేదు.
ఇలా ఉంటే నటించడం మానేసినా పట్టించుకోరు..
నా సినిమా కెరీర్ మొదలై 13 ఏళ్ళు పూర్తయ్యింది. హ్యాపీగా ఏడాదికో సినిమా చేస్తున్నాను. అందరు హీరోయిన్లలా ఎక్కువ సినిమాలు చేయడం లేధనో, అగ్రకథానాయికగా ఎదలేదనో నేనెప్పుడూ బాధపడలేదు. దీనివల్ల ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఒకవేళ భవిష్యత్ లో సినిమాలు చేయడం మానేసినా కూడా.. "ఈ అమ్మాయ్ మామూలుగా కూడా ఏడాదికి ఒకట్రెండు సినిమాలేగా చేసింది" అనుకొంటారే తప్ప.. "స్వాతి సినిమాలు మానేసింది, స్వాతి కెరీర్ అయిపోయింది" అంటూ నన్ను విమర్శించరు.
అంతకుమించిన ఆనందం..
సినిమాకి సినిమాకి మధ్య వచ్చే గ్యాప్ లో సరదాగా నా తల్లిదండ్రులతో గడిపేందుకు సమయం లభిస్తుంది. మా అమ్మతో నాకు కాబోయేవాడి గురించి చర్చించడం, సరదాగా షికార్లు తిరగడం. మనముందే మన తల్లిదండ్రుల వయసు పెరుగుతుంటే చూడడం కంటే అదృష్టం ఇంకేముంటుంది. ఇప్పుడు నేను ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను.
గాసిప్పుల నుంచే నేర్చుకొన్నాను..
నా గురించి కొంత మంది గాసిప్పు రాయుళ్ళు ఏవేవో రాసేస్తుంటారు. ఆ హీరోతో ప్రేమలో పడ్డానని, కెరీర్ అయిపోయిందని.. ఇలా చాలా వార్తలు వస్తుంటాయి. మొదట్లో అలాంటి వార్తలు చదివి బాధపడేదాన్ని.. తర్వాత వాటిని చూసి నవ్వుకొన్నేదాన్ని. ఒకవిధంగా ఆ గాసిప్పులు నన్ను మానసికంగా దృఢంగా మార్చాయి. అప్పట్నుంచి అనవసరమైన విషయాల్ని సీరియస్ గా తీసుకోవడం తగ్గించాను.
హ్యాపీగా ఇల్లు సర్దుకుంటూ కూర్చుంటా..
నన్ను అర్ధం చేసుకొనే వ్యక్తీ కోసం చూస్తున్నాను. నన్ను సంతోషంగా చూసుకోగలడు, నన్ను అర్ధం చేసుకోగలడు అన్న నమ్మకం ఎవరిమీదైనా కలిగితే.. అప్పుడు ఆ వ్యక్తిని పెళ్లాడి.. చక్కగా నా ఇల్లు సర్దుకుంటూ కూర్చుంటా. పెళ్లైయ్యాక సినిమాలు చేస్తానా లేదా అనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదు!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments