బీజేపీలో చేరిన స్వామిగౌడ్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీతో పాటు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న స్వామిగౌడ్ నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పాల్గొన్నారు. బీజేపీలో చేరిన అనంతరం స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని తాను మాతృసంస్థగా భావిస్తున్నానని.. ఈ పార్టీలో చేరడమంటే సొంత గూటికి వచ్చినట్టుందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకే మేయర్ పీఠం దక్కే అవకాశం ఉందన్నారు.
ఉద్యమకారులను ఎండన నిలబెట్టి.. పోరాడని వారికి మాత్రం గొడుగు పట్టారని స్వామిగౌడ్ విమర్శించారు. అసలైన ఉద్యమకారులను పక్కనబెట్టి.. ఉద్యమ నేపథ్యంలో లేని వారికి పార్టీలో ప్రాధాన్యం కల్పించడమే కాకుండా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టీఆర్ఎస్ అధిష్టానం అగ్రతాంబూలం ఇవ్వడం ఎంతో బాధించిందన్నారు. చాలా మంది ఉద్యమకారులకు టీఆర్ఎస్లో ఆత్మగౌరవం లభించడం లేదన్నారు. ఐదేళ్లలో ఉన్న పరిపాలన వేరు. ఇప్పుడున్న పాలన వేరని స్వామిగౌడ్ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమకారులు కనీస మర్యాదకు కూడా నోచుకోలేదా? అని స్వామిగౌడ్ ప్రశ్నించారు. రెండేళ్లలో కనీసం వంద సార్లు కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం యత్నించినా లభించలేదన్నారు. ఆరేళ్ల అనంతరం కూడా టీఆర్ఎస్లో ఆత్మాభిమానం కోసం పోరాడాల్సి వచ్చిందన్నారు. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే టీఆర్ఎస్ను వీడాల్సి వచ్చిందన్నారు. ఉద్యమకారుల ఆత్మాభిమానం కాపాడడం కోసమే తాను బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు. పదవుల కోసం బీజేపీలో చేరలేదని స్వామిగౌడ్ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments