టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త అనుమానాస్పద మృతి.. అసలేం జరుగుతోంది?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో పంచాయతీ ఎన్నికలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవైపు పంచాయతీలు ఏకగ్రీవం చేసుకునే క్రమంలో భారీ ఎత్తున డబ్బు పెట్టడానికి సైతం అభ్యర్థులు వెనుకాడటం లేదు. ఇప్పటికే సర్పంచ్ పదవి రూ.50 లక్షలకు పైనే పలుకుతోందని సమాచారం. ఎన్నికలను నిలిపివేసేందుకు అధికార పార్టీ చివరి క్షణం వరకూ తన యత్నాలు కొనసాగించింది. ఇక అది సాధ్యపడక పోవడంతో నయానో.. భయానో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను నామినేషన్ వేయనీకుండా అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అభ్యర్థి భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఏపీలో కలకలం రేపుతోంది.
తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో కిడ్నాప్ అయిన టీడీపీ అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. జగ్గంపేట మండలం గొల్లలగుంటలో టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా సబ్బెళ్ల పుష్పవతి నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన అనంతరం ఆమె భర్త శ్రీనివాసరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆయనకు మత్తు మందు ఇచ్చి కాళ్లు, చేతులు కట్టేసి అడవిలో వదిలిపెట్టారు. తన భర్తపై దౌర్జన్యం చేసింది వైసీపీ కార్యకర్తలేనని పుష్పవతి ఆరోపిస్తున్నారు. కాగా.. అపహరణకు సంబంధించి ఆయనను పోలీసులు విచారించారు. అనూహ్యంగా శ్రీనివాసరెడ్డి నేడు తన పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు విచారించిన కొన్ని గంటల్లోనే శ్రీనివాసరెడ్డి మృతి చెందడం గమనార్హం.
అలాగే.. గొల్లప్రోలు మండలం దుర్గాడ పంచాయతీలో పొన్నాడ వరలక్ష్మి అనే అభ్యర్థి సర్పంచ్‌గా పోటీ చేయడానికి నామినేషన్ వేయడానికి కార్యాలయానికి వెళ్లారు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఆమె భర్తకు ఫోన్ చేసి సమాచారం అందివ్వడంతో ఆయన వచ్చి భార్యను నామినేషన్ వెయ్యనీయకుండా తీసుకెళ్లిపోయారని సమాచారం. మొత్తానికి ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎస్ఈసీకి పెను సవాల్ గానే మారాయని తెలుస్తోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సన్నాహాలు చేస్తోంటే ఎలాగైనా ఏకగ్రీవం చేయించాలని అధికార పార్టీ కసరత్తులు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments