అడగ్గానే సాయం చేసే ‘చిన్నమ్మ’ ఇకలేరు!

  • IndiaGlitz, [Wednesday,August 07 2019]

బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67)తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న ఆమె.. మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సుష్మాను బతికించడానికి ఐదుగురు డాక్టర్లతో కూడిన బృందం శక్తికి మించి ప్రయత్నాలు చేసినప్పటికీ వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కాగా నిన్న జమ్ముకశ్మీర్ విభజన బిల్లు ఉభయ సభల్లో ఆమోదించిందని బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతుండగా సుష్మా ఇకలేరన్న వార్త ఆ పార్టీ శ్రేణుల్లో విషాదం నింపింది. సుష్మా మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పలువురు ప్రముఖులు సంతాపం తెలిపి.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిప్రకటించారు.

కేంద్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన సుష్మా స్వరాజ్ 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న విషయం విదితమే. ఇదిలా ఉంటే.. గతంలో ఆమె కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయడంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాగా సుష్మా అందరూ ముద్దుగా ‘చిన్నమ్మ’ పిలుచుకునేవారు.

జననం..!

1952 ఫిబ్రవరి 14న అంబాలాలో జన్మించిన సుష్మా స్వరాజ్ కళాశాల విద్య వరకు స్థానికంగానే చదివారు. అనంతరం పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1970 లలో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు. 1975లో సుష్మాస్వరాజ్ వృత్తిరీత్యా న్యాయవాది అయిన స్వరాజ్ కౌశల్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు ఉన్నారు. భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మిజోరాం గవర్నరుగా పనిచేశారు. ముఖ్యంగా బరోడా బాంబు పేలుళ్ళ కేసులో జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదించి గెలిపించిన ఘనత ఈయనదే.

రాజకీయ ప్రస్థానం!

1977లో జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవి ఉన్నారు. అనంతరం 1987లో రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభకు ఎన్నికైనారు. 1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోకదళ్-భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో ఈమె విద్య, ఆరోగ్య మరియు సివిల్ సప్లై శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు.

జాతీయ రాజకీయాల్లోకి ఇలా ప్రవేశం..!

1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. అంతకు ముందు 1980, 1984, 1989లలో కార్నాల్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1996లో ఈమె దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికైన ఈమె.. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించించారు. 1998లో 12వ లోక్‌సభకు మళ్ళీ రెండో పర్యాయం దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వాజపేయి రెండో మంత్రివర్గంలో మళ్ళీ అదే శాఖను చేపట్టినారు. మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యునికేషన్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడానికి 1998 అక్టోబరులో సుష్మాస్వరాజ్‌ను భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేంద్రమంత్రి మండలి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా సుష్మాస్వరాజ్ రికార్డు సృష్టించింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పరాజయం పొందుటతో డిసెంబరులో మళ్ళీ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించారు.

సోనియాపైనే పోటీ

కాగా.. 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా బీజేపీ తరఫున సుష్మాస్వరాజ్‌ను బరిలోకి దించారు. దేశ స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ ఇక్కడ గెలవలేదు. దీంతో ఇక్కడ్నుంచే మరోసారి పోటీ చేయాలని భావించిన సోనియమ్మను ఓడించాలని బీజేపీ భావించింది. అయితే అందరూ ఊహించినట్లుగానే సుష్మాస్వరాజ్ ఓడిపోయారు. అయితే సోనియాపైనే పోటీచేసిన దమ్మున్న నేతగా దేశ ప్రజల దృష్టిని చిన్నమ్మ ఆకర్షించింది.

ఇలా మొత్తం.. ఏడుసార్లు లోక్‌సభ ఎంపీగా చిన్నమ్మ గెలిచారు. 1990లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికై దేశానికి సేవలు చేశారు. గతంలో అనగా 2014-19 మధ్య సుష్మా విదేశాంగ శాఖ మంత్రిగా మోదీ కేబినెట్‌లో పనిచేశారు. అనంతరం 2019 అనారోగ్యంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

అడిగితే కాదనకుండా సాయం చేసే చిన్నమ్మ!

తనకు ఫలానా సాయం చేయండి చిన్నమ్మా.. అని సింగిల్ ట్వీట్ చేస్తే చాలు.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే రియాక్ట్ అయ్యి సమస్యకు పరిష్కారం చూపేవారు. మరీ ముఖ్యంగా విదేశాల్లో చిక్కుకుపోయి స్వదేశానికి తిరిగి రావడానికి ఇబ్బందులు పడేవారిని చాలా మందికి సాయం చేసి ఇండియా రప్పించిన ఘనత సుష్మాదే అని చెప్పుకోవచ్చు. ఇలా ఎంతో మందికి సాయం చేసి వారి గుండెల్లో స్థానం దక్కించుకున్నారు. ఇవాళ చిన్నమ్మ లేరన్న వార్తను సాయం పొందిన వారు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు.