ప్రభుత్వ లాంఛనాలతో సుష్మా అంత్యక్రియలు
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ గుండెపోటుతో మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందారు. చిన్నమ్మ ఇకలేరన్న వార్త విన్న వీరాభిమానులు, బీజేపీ కార్యకర్తల శోకసంద్రంలో మునిగారు. ఆమె మృతిని బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. చిన్నమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడే పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ మంత్రులు అక్కడికెళ్లి పరామర్శించారు. అయితే కొన్ని క్షణాల్లోనే ఆమె ఇక లేరు అని వైద్యులు చెప్పడంతో బీజేపీ నేతలు షాక్ తిన్నారు. ఆస్పత్రి నుంచి రాత్రికి రాత్రే భౌతిక కాయాన్ని స్వగృహానికి తరలించారు.
నేడు అంత్యక్రియలు...
కాగా.. చిన్నమ్మ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే.. నేతలు, కార్యకర్తల సందర్శనార్ధం ఉదయం 11 గంటల వరకు ఇంటి దగ్గర ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆమె భౌతిక కాయాన్ని ఉంచనున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మీడియాకు తెలిపారు. కాగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక లాంఛనాలతో లోదీ రోడ్డులోని స్మశాన వాటికలో సుష్మా అంత్యక్రియలు జరపనున్నట్లు నడ్డా తెలిపారు.
సుష్మా మరణం తీరని లోటు..
బుధవారం ఉదయం కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సుష్మా స్వరాజ్ భౌతిక కాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చిన్నమ్మతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. సుష్మా మరణం తీరని లోటని, ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. దేశం, పార్టీ ఒక గొప్ప రాజకీయ నాయకురాలిని కోల్పోయిందని తెలిపారు. కాగా.. వివిధ దేశాలతో భారత్ సంబంధాలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషించిన ఘనత చిన్నమ్మదేనని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులు బాధల్లో ఉంటే సుష్మా వెంటనే స్పందించి సాయం అందించేవారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout