Suryakantham Review
నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్, పెర్లెన్ కలిసి నటించిన సినిమా `సూర్యకాంతం`. ఇందులో కాంతం సమస్య, అభి పరిష్కారం, పూజ అందుకు కారణం అవుతారు. మరి కాంతం, పూజ మధ్య అభి ఎలా ఇరుక్కున్నాడు? అతను బయట పడటానికి చేసిన ప్రయత్నం ఎలాంటిది? ఇంతకీ కాంతం సినిమాలో సూర్యకాంతం టైపా? తనదైన ఓన్ స్టైల్‌ని క్రియేట్ చేసుకున్న రకమా? కమాన్ గో త్రూ ద రివ్యూ...
కథ:
సూర్యకాంతం(నిహారిక) సరదాగా ఉండే అమ్మాయి. ఈమెను అభి(రాహుల్ విజయ్) ప్రేమిస్తాడు. ముందు అభి ప్రేమను సూర్యకాంతం పెద్దగా పట్టించుకోనట్టే ఉంటుంది. మరోవైపు సూర్యకాంతం అమ్మ(సుహాసిని).. తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంటుంది. కానీ.. సూర్యకాంతం తల్లి మాటను వినదు. ఓరోజు ఆమె గుండెపోటుతో చనిపోవడంతో సూర్యకాంతం ఒంటరిదవుతుంది. ఆ సమయంలో అభి.. సూర్యకాంతంకు అండగా నిలబడతాడు. ఓరోజు తన మనసులోని ప్రేమను సూర్యకాంతంకు చెబుతాడు. జీవితంలో కమిట్‌మెంట్ కోరుకునే అబ్బాయి అభి.. ప్రేమ, పెళ్లి గురించి చెప్పిన తర్వాత సూర్యకాంతం ఓ సంవత్సరం పాటు కనపడదు. ఇంట్లో చూసిన పూజ(పెర్‌నెలె బెనెసియా)ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. వారి ఎంగేజ్‌మెంట్‌కు రెండు రోజుల ముందు మళ్లీ సూర్యకాంతం ఎంట్రీ ఇస్తుంది. అభికి తన ప్రేమ గురించి చెబుతుంది. అయితే పూజతో తన ఎంగేజ్‌మెంట్ గురించి అభి చెబుతాడు. సూర్యకాంతం ఇద్దరి మధ్య చెడగొట్టి .. అభిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. చివరకు ఏమౌతుంది? అభి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? సూర్యకాంతం కమిట్‌మెంట్‌ను కోరుకుందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
దర్శకుడు ప్రణీత్ ఇంతకు నిహారికతో చేసిన ముద్దపప్పు అవకాయ్ వెబ్ సిరీస్ మంచి పేరు తెచ్చుకుంది. అప్పటి వరకు వెబ్ సిరీస్‌లతో సరిపెట్టుకున్న ఈ కుర్ర దర్శకుడు నిహారికతోనే సూర్యకాంతం అనే కథను తయారు చేసుకున్నాడు. ఎలాంటి కమిట్‌మెంట్స్ పెట్టుకోకూడదు. అనే కమిట్‌మెంట్ ఫోబియో ఉండే ఓ అమ్మాయి. ప్రేమ, పెళ్లి అనే కమిట్‌మెంట్ ఉండే అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. నిహారిక, రాహుల్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. నిహారిక ఇప్పటి వరకు చేసిన రెండు చిత్రాలకంటే ఈ సినిమాలో బాగానే చేసింది. అయితే పాత్రానుగుణంగా ఇంకా గొప్పగా చేసుండవచ్చుననిపించింది. పాత్ర పరిమితి చిన్నదే అయినా సుహాసిన తను చేసిన తల్లి పాత్రలో ఒదిగిపోయారు. పెర్‌లెనె , శివాజీరాజా, హీరో స్నేహితుడు సత్య ఇతర పాత్రధారులందరూ వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. దర్శకుడు ప్రణీత్ అమ్మాయి చుట్టూ కథను అల్లుకునేటప్పుడు పాత్రలను డిజైన్ చేసుకునే తీరు.. సన్నివేశాలు గ్రిప్పింగ్‌గా ఉండాలి. కానీ సినిమాలో అలా ఉండదు. సాధారంగా విలన్..హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటే.. హీరో వచ్చి ఎలా చెడగొట్టాలనుకుంటాడో ... అలాంటి పాత్రను పాజిటివ్ పాత్రల మధ్య జొప్పించే ప్రయత్నం చేశాడు. ఇక చివరలో ఎమోషన్స్‌ను బాగానే దట్టించారు. ప్రేమంటే త్యాగం కూడా అని చెప్పిన తీరు బాగానే ఉంది. అయితే హీరోయిన్ కమిట్‌మెంట్ ఫోబియోతో ఎక్కడికి..ఎందుకు వెళ్లిపోతుందనే దానిపై కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. పొ పొ వే పొ పొవే పొవే ప్రేమా!.. సాంగ్ ఆకట్టుకుంటుంది. మిగిలిన పాటలన్నీ సోసోగానే ఉన్నాయి. మార్క్ కె.రాబిన్ సంగీతం .. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ఇక హరిజ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ బాలేదు. మొత్తంగా దర్శకుడి అనుభవ లేమి కొట్టొచ్చినట్టు కనపడుతుంది.
బోటమ్ లైన్: సూర్యకాంతం.. వెబ్ సిరీస్‌గా చేసుంటే బావుండేదేమో
Read 'Suryakantham' Movie Review in English
- Read in English