5 సార్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: సుర్వీన్ చావ్లా

  • IndiaGlitz, [Tuesday,September 24 2019]

మోహ‌న్‌బాబు, శ‌ర్వానంద్ క‌లిసి న‌టించిన చిత్రం 'రాజు మ‌హ‌రాజు' చిత్రంలో హీరోయిన్‌గా న‌టించిన సుర్వీన్ చావ్లా కాస్టింగ్ కౌచ్‌పై తొలిసారి స్పందించింది. స‌మాజంలో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల‌పై మీ టూ ఉద్య‌మం తీవ్రస్థాయిలో జ‌రిగింది. అప్పుడేమీ మాట్లాడ‌ని సుర్వీన్ చావ్లా రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులు గురించి తెలిపారు. ఆమె తాను కాస్టింగ్ కౌచ్ ఐదు సార్లు ఎదుర్కొన్నాన‌ని తెలిపారు. రెండుసార్లు బాలీవుడ్ నుంచి ఈ స‌మ‌స్య వ‌స్తే, మూడు సార్లు ద‌క్షిణాది నుండి తాను కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాన‌ని తెలిపారు.

''టీవీ రంగంలో బాగానే రాణించినా, సినిమా రంగంలో మాత్రం నా ప్ర‌యాణం అంత సాఫీగా సాగ‌లేదు. 'నీ శ‌రీరంలో ప్ర‌తి భాగాన్ని తెలుసుకోవాల‌నుకుంటున్నాను' అని ద‌క్షిణాదికి చెందిన ఓ ద‌ర్శ‌కుడు అన్నాడు. అప్ప‌టి నుండి త‌న ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయ‌లేదు. మ‌రోసారి త‌మిళం త‌ప్ప మ‌రో భాష రాని నేష‌న‌ల్ అవార్డ్ తీసుకున్న ఓ దర్శ‌కుడి ద‌గ్గ‌ర‌కు ఆడిష‌న్‌కి వెళితే ఏవేవో డైలాగులు చెప్పించి, ఏవేవో చేయించే ప్ర‌య‌త్నం చేశాడు. అప్పుడు నా ఆరోగ్యం బాలేదంటూ ముంబై వ‌చ్చేశాను. త‌ర్వాత త‌నే ఫోన్ చేసి 'నీ ఆరోగ్యం బాగోలేదు క‌దా, నేను ముంబై రానా?' అని అడిగాడు. వేరే వారితో ఫోన్ చేయించి, 'సార్ నీ గురించి పూర్తిగా తెలుసుకోవాల‌నుకుంటున్నారు. సినిమా జరిగే వరకే త‌ర్వాత ఆపేయొచ్చు' అని అడిగించారు. అప్పుడు త‌న‌కు 'మీరు రాంగ్ డోర్ త‌డుతున్నారు. న‌న్ను టాలెంటెడ్ అనుకుంటే మీతో ప‌నిచ‌స్తాను' అన్నాను. బాలీవుడ్ విష‌యానికి వ‌స్తే ఓ దర్శ‌కుడు 'నీ ఎద ఎలా ఉందో చూడాలి' అని అంటే.. మ‌రొక‌రు 'నీ తొడ‌లు ఎలా ఉన్నాయో చూడాలి' అన్నారు. వాళ్ల ఆఫీసుల నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేశానంటూ త‌న‌కు ఎదురైన స‌మ‌స్య‌లు గురించి సుర్విన్ చావ్లా చెప్పుకొచ్చారు.