సర్వే సత్యనారాయణ కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్ ఇవ్వనున్నారా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్య నారాయణ కారెక్కనున్నారా..? సొంత పార్టీ నేతలే ఆయన్ను పొమ్మనలేక పొగపొడుతున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. గత రెండ్రోజులుగా సర్వే పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తితో మీడియా ముందుకొచ్చి ఏదేదో మాట్లాడేస్తూ.. తిన్నగా గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వత్తాసు పలకడం.. దగ్గరయ్యేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తుండం గమనార్హం. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ చేసిన ‘ఇడియట్స్’ లాంటి వ్యాఖ్యలను సమర్థించడంతో సర్వేను ఏం అనాలో.. ఏం అనకూడదో అధిష్టానానికి దిక్కుతోచక సస్పెన్షన్ వేటు వేసింది. అయినప్పటికీ ఆయన ఏమాత్రం తగ్గలేదు. ఆ మరుక్షణం నుంచి మరింత డోస్ పెంచిన సర్వే.. తెలంగాణలో కాంగ్రెస్‌ను సర్వే నాశనం చేసింది.. తనను, భట్టీ విక్రమార్కను ఓడించాలనుకున్నది ఉత్తమ్ కుమార్‌రెడ్డేనంటూ తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఉత్తమ్, కుంతియా హఠావో... కాంగ్రెస్ బచావో అంటూ సరికొత్త నినాదాలను తెరమీదికి తేవడంతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు.
అయితే.. సొంత పార్టీపైనే ఈ రేంజ్‌లో విరుచుకుపడుతున్న సర్వే కాంగ్రెస్‌లో ఎక్కువ రోజులు కొనసాగలేరని.. త్వరలో కారెక్కుతారని వార్తలు వినవస్తున్నాయి. ఇదే జరిగితే టి. కాంగ్రెస్ టీమ్ మరో సీనియర్ వికెట్‌ను కోల్పోనుందన్న మాట. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉపాధ్యక్షురాలు సోనియా గాంధీ దగ్గర సర్వేకు మంచి పేరుంది. ఆయన ఏం చెప్పినా అధిష్టానం కాదనదు కూడా. కాగా ఇప్పటికే పలువురు కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారు కారెక్కారు.. మరికొందరు అదే బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు కూడా. అయితే ఇలాంటి తరుణంలో సర్వే కూడా గులాబీ గూటికి చేరితే కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. అయితే తాజా పరిణామాలతో అధిష్టానం అలర్టయ్యి నష్ట పరిహారం జరగకుండా చూస్కుంటుందా లేకుంటే .. సర్వే ‘చేయి’ ఇచ్చినా పెద్దగా నష్టలేదని మిన్నకుండిపోతుందో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments