Suriya:విజయ్‌కాంత్ సమాధి వద్ద బోరున ఏడ్చేసిన హీరో సూర్య

  • IndiaGlitz, [Friday,January 05 2024]

దివంగత కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌(vijayakanth) సమాధి వద్ద స్టార్ హీరో సూర్య(Suriya) నివాళులర్పించారు. విజయకాంత్ మృతి చెందినప్పుడు షూటింగ్ కారణంగా ఆయన విదేశాల్లో ఉన్నారు. దీంతో తుది నివాళి అర్పించలేకపోయారు. తాజాగా చెన్నై చేరుకున్న సూర్య.. కెప్టెన్ సమాధి వద్ద నివాళి అర్పించి ఆయనతో ఉన్న అనుబంధాని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమ హీరో ఇలా కన్నీరు పెట్టుకోవడం చూసి అభిమానులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.

తనకు పెద్దన్న లాంటి విజయకాంత్‌ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఈ సందర్భంగా సూర్య తెలిపారు. కెరీర్‌ తొలినాళ్లలో నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ తనకు ఎలాంటి గుర్తింపు రాలేదన్నారు. ఆ సమయంలో ‘పెరియన్న’ మూవీలో తొలిసారి విజయకాంత్‌తో కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు. సెట్‌లో ఆయనతో కలిసి భోజనం చేశానని.. డ్యాన్స్‌, ఫైట్‌ బాగా చేయాలంటూ ఎంతో ప్రోత్సహించేవారని పేర్కొన్నారు. అలా తనలో స్ఫూర్తి నింపారన్నారు. కెప్టెన్ మరణం తమిళ చిత్రపరిశ్రమకు తీరని లోటని సూర్య వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

కాగా మధుమేహం, శ్వాస సంబంధిత అనారోగ్యంతో గత కొద్దిరోజులుగా చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విజయ్‌కాంత్ సెంబర్ 29న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.