68th national film awards: జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ‘‘సూరారైపోట్రు’’ హవా.. ఏకంగా ఐదు అవార్డులు
- IndiaGlitz, [Friday,July 22 2022]
జాతీయ అవార్డ్స్(National Awards) వేదికపై తమిళ చిత్రం సూరారై పోట్రు(Soorarai Pottru) సత్తా చాటింది. ఏకంగా ఐదు అవార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, జాతీయ ఉత్తమ చిత్రం, స్క్రీన్ ప్లే, ఉత్తమ సంగీతం(బీజీఎమ్) విభాగాల్లో సూరారై పోట్రు జాతీయ అవార్డ్స్ గెలుపొందింది. ఉత్తమ నటుడిగా సూర్య(Suriya), ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి, మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్, స్క్రీన్ ప్లే రైటర్ గా సుధా కొంగర, షాలిని ఉషా నాయర్, ఉత్తమ చిత్రం విభాగంలో సుధా కొంగర అవార్డులు గెలుపొందారు.
ఆస్కార్ రేసులోనూ నిలిచిన సూరారైపోట్రు:
ఇకపోతే.. ఆకాశం నీ హద్దురా చిత్రం గతంలో ఆస్కార్ రేసులోనూ నిలిచిన సంగతి తెలిసిందే. ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో ఆస్కార్ పోటీలో నిలిచిన ఈ చిత్రం నిరాశపరిచింది. దీంతో సూర్య ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే ఇక్కడ ఆస్కార్ కమిటీ సూర్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడిగా ఆయనకు అవకాశం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 397 మంది ప్రముఖులు వుండే ఆ కమిటీలో భారత్ నుంచి బాలీవుడ్ నటి కాజోల్, తమిళ నటుడు సూర్య మాత్రమే స్థానం దక్కించుకోవడం విశేషం. అంతేకాదు.. ఒక కోలీవుడ్ నటుడికి ఇలాంటి గౌరవం దక్కడం ఇదే తొలిసారి.
హిందీలోకి రీమేక్:
కాగా.. నేరుగా ఓటీటీలో విడుదలై భారీ విజయం సాధించిన ‘సూరారై పొట్రు’ చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ను తెరకెక్కించిన సుధా కొంగర రీమేక్ వెర్షన్ను కూడా తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య స్యయంగా నిర్మిస్తున్నారు.