సూర్య 24 చూడాల్సిందే...అన‌డానికి అయిదు కార‌ణాలు...

  • IndiaGlitz, [Thursday,May 05 2016]

త‌మిళ హీరో సూర్య - మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం 24. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టించారు. ఈ చిత్రాన్ని 2 డి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై హీరో సూర్య నిర్మించారు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన 24 చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 6న రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 2,000 స్ర్కీన్స్ లో 24 మూవీ రిలీజ్ అవుతుంది. అయితే...అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన 24 మూవీని మిస్ కాకుండా చూడాల్సిందే అంటున్నారు ప్రేక్ష‌కాభిమానులు. ఇంత‌లా.. 24 మూవీ క్రేజ్ ఏర్ప‌రుచుకోవ‌డానికి...ఈ మూవీని మిస్ కాకుండా చూడాల్సిందే... అన‌డానికి అయిదు కార‌ణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

ఆస‌క్తి క‌లిగిస్తున్న ఆత్రేయ‌..

గ‌జ‌ని చిత్రం త‌ర్వాత హీరో సూర్య త‌మిళ‌నాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. త‌న‌కున్న క్రేజ్ కి త‌గ్గ‌ట్టు సూర్య‌ త‌న ప్ర‌తి సినిమాలో ఏదో కొత్త‌ద‌నం చూపించాల‌ని త‌పిస్తుంటాడు. అందుక‌నే సూర్య సినిమా అంటే...ప్రేక్ష‌కులు స‌క్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఒక్క‌సారైనా చూడాల‌నుకుంటారు. క‌మ‌ల్ హాస‌న్ ఎలాగైతే విభిన్న పాత్ర‌లు పోషిస్తూ...ప్ర‌యోగాలు చేస్తుంటారో సూర్య కూడా అలాగే విభిన్న పాత్ర‌లు పోషిస్తూ ప్ర‌యోగాలు చేస్తుంటాడు. అందుక‌నే సూర్య‌ని మినీ క‌మ‌ల్ హాస‌న్ అంటుంటారు. ఇక 24 విష‌యానికి వ‌స్తే...ఈ చిత్రంలో సూర్య మూడు విభిన్న‌పాత్ర‌లు పోషించాడు. ఫ‌స్ట్ టైమ్ సూర్య ఒకే చిత్రంలో మూడు పాత్ర‌లు పోషించ‌డం విశేషం. మూడు పాత్ర‌లే అయిన‌ప్ప‌టికీ ఐదు గెట‌ప్స్ లో సూర్య క‌నిపిస్తాడ‌ట‌. ముఖ్యంగా ఆత్రేయ క్యారెక్ట‌ర్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంద‌ట‌. ఈ పాత్ర ప్రేక్ష‌కాభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకునేలా ఉంటుంద‌ని స‌మాచారం. హీరో సూర్య కూడా మూడు పాత్ర‌లో ఆత్రేయ క్యారెక్ట‌ర్ నాకు బాగా న‌చ్చింది అని చెప్ప‌డంతో ఆత్రేయ పై ఆస‌క్తి పెరిగిపోతుంది.

సంగీత సంచ‌ల‌నం రెహ‌మాన్ సంగీతం...

రెహ‌మాన్ బిజీగా ఉండ‌డం వ‌ల‌న‌ సంవ‌త్స‌రానికి రెండు త‌మిళ చిత్రాలు మాత్ర‌మే చేస్తున్నారు. అదీ కూడా క‌థ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటేనే ఓకే చెబుతున్నార‌ట‌. క‌థ న‌చ్చ‌క‌పోతే ఎలాంటి మోహ‌మాటం లేకుండా నో అని చెప్పేస్తున్నార‌ట‌.
రెహ‌మాన్ కి 24 క‌థ చెప్పిన‌ వెంట‌నే న‌చ్చేసింద‌ట‌. దీంతో మ‌రో ఆలోచ‌న లేకుండా నేను ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తాన‌ని చెప్పార‌ట‌. అంతే కాకుండా... రెహ‌మాన్ క‌థ విన్న త‌ర్వాత చెప్పిన మాట‌లు...24 టీమ్ కి మ‌రింత ఉత్సాహాన్ని అందించాయ‌ట‌. ఇక 24 ఆడియో గురించి చెప్పాలంటే...ఈ ఆడియోకు చాలా మంచి స్పంద‌న ల‌భిస్తోంది. 24 పాట‌లు అన్నీ హాయిగా వినేలా...పాడుకునేలా ఉన్నాయి. పాట‌లే ఇంత విన‌సొంపుగా ఉంటే...ఈ మూవీ రీ రికార్డింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. 24 టీమ్ పాట‌లు క‌న్నా..ఎక్కువ రీ రికార్డింగ్ గురించే మాట్లాడుతున్నారు. రెహ‌మాన్ రీ రికార్డింగ్ 24 మూవీ స‌క్సెస్ రేంజ్ ని మ‌రింత పెంచుతుంది అంటున్నారు.

విజువ‌ల్ వండ‌ర్...

ఏ సినిమాలో అయినా ప్రేక్ష‌కులుకు ఓ కొత్త ప్ర‌పంచాన్ని చూపించాలంటే దానికి త‌గ్గ‌ట్టు స‌రైన కెమెరామెన్ కావాలి. ముఖ్యంగా 24 లాంటి సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ కి ఫోటోగ్ర‌ఫీ కీ రోల్ ప్లే చేస్తుంది అన‌డంలో సందేహం లేదు. 24 మూవీకి సినిమాటోగ్రాఫ‌ర్ తిరు. ఆరు సంవ‌త్స‌రాల గ్యాప్ త‌రువాత తిరు కోలీవుడ్ ఫిల్మ్ కి వ‌ర్క్ చేయ‌డం విశేషం. క‌థ‌కు త‌గ్గ‌ట్టు ఆహ్లాద‌క‌రంగా...వావ్ అనిపించేలా అద్భుత‌మైన ప్ర‌దేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీక‌రించారు. ఇప్ప‌టికే రిలీజైన 24 టీజ‌ర్, సాంగ్స్ ఎంత‌గా ఆక‌ట్టుకుంటున్నాయో తెలిసిందే. ముఖ్యంగా ఈ మూవీ కోసం పోలెండ్ లోని ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని అద్భుత‌మైన లోకేష‌న్స్ లో షూట్ చేసారు. ఈ విజువ‌ల్స్ ఆడియోన్స్ కి ఒక విజువ‌ల్ ట్రీట్ అందిస్తుంది.

అద్భుతం అనిపించే ఆర్ట్

ఈ చిత్రానికి అమిత్ మ‌రియు సుబ్ర‌త చ‌క్ర‌వ‌ర్తి ఆర్ట్ డైరెక్ట‌ర్స్ గా వ‌ర్క్ చేసారు. బాలీవుడ్ లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ఆర్ట్ డైరెక్ట‌ర్స్ గా వ‌ర్క్ చేసిన అమిత్, సుబ్ర‌త చ‌క్ర‌వ‌ర్తి ల‌కు 24 తొలి త‌మిళ చిత్రం కావ‌డం విశేషం. ఈ స్ర్కిప్ట్ లో ఆర్ట్ డైరెక్ట‌ర్స్ వ‌ర్క్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఈ చిత్రంలోని టైమ్ మిష‌న్, రిసెర్చ్ ల్యాబ్ ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలో చూడ‌ని విధంగా అమిత్, సుబ్ర‌త చ‌క్ర‌వ‌ర్తి రూపొందించారు. ఈ టైమ్ మిష‌న్, రీసెర్చ్ ల్యాబ్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆకట్టుకుంటాయి.

విభిన్న‌క‌థా చిత్రాల సృష్టిక‌ర్త విక్ర‌మ్ కుమార్...

బాలీవుడ్ లో విభిన్న క‌ధాంశంతో 13 బి చిత్రం తెర‌కెక్కించి స‌క్సెస్ సాధించారు డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్. 13 బి త‌ర్వాత ఆరు సంవ‌త్స‌రాల గ్యాప్ తీసుకుని త‌మిళ్ లో ఓ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆత‌ర్వాత తెలుగులో ఇష్క్, మ‌నం చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసారు. అక్కినేని హీరోలు క‌లిసి న‌టించిన మనం చిత్రం తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో ఓ క్లాసిక్ గా నిలిచింది. పున‌ర్జ‌న్మ పై చాలా చిత్రాలు వ‌చ్చాయి కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు రాని విభిన్న క‌థాంశంతో మనం చిత్రాన్ని తెర‌కెక్కించి..సంచ‌ల‌నం సృష్టించి...టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు విక్ర‌మ్ కుమార్. విభిన్న క‌థా చిత్రాల సృష్టిక‌ర్త విక్ర‌మ్ కుమార్ సంచ‌ల‌న చిత్రం మ‌నం త‌ర్వాత తెర‌కెక్కించిన చిత్రం 24 కావ‌డం... ఈ చిత్రంలో సూర్య మూడు విభిన్న పాత్ర‌లు పోషించ‌డం...ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేప‌ధ్యంతో రూపొంద‌డంతో 24 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

24 మూవీని ఖ‌చ్చితంగా చూడాల్సిందే అని చెప్ప‌డానికి ఈ ఐదు కార‌ణాలే కాదు...ఇంకా చాలా కార‌ణాలు చెప్ప‌చ్చు. అటు అభిమానులు - ఇటు ఇండ‌స్ట్రీ 24 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచ‌నాలతో రేపు రిలీజ్ అవుతున్న 24 అంచ‌నాలకు త‌గ్గ‌ట్టు అంద‌ర్నీఆక‌ట్టుకుని సంచ‌ల‌న విజ‌యాన్ని సాధిస్తుంద‌ని ఆశిద్దాం.