ఎస్.. ఉగ్రమూకలపై సర్జికల్‌ స్ట్రైక్స్ నిజమే

  • IndiaGlitz, [Tuesday,February 26 2019]

పుల్వామా దాడి నేపథ్యంలో ఉగ్రమూకలను మట్టుబెట్టాలని ఇండియన్ ఆర్మీ పక్కా వ్యూహం ప్రకారమే మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మూడు స్థావరాలపై ఈ దాడిలో సుమారు 300మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలిసింది. అయితే దీనిపై భారత్ కానీ అటు పాక్‌‌గానీ.. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో అసలేం జరిగిందో.. హైప్ కోసం ఇలా చేస్తున్నారా అనేది తెలియరాలేదు. అయితే ఈ దాడిపై క్లారిటీ ఇచ్చేందుకు విదేశాంగ శాఖ ప్రకటన చేసింది.

ఎస్.. దాడులు చేశాం..

మంగళవారం ఉదయం విదేశాంగ కార్యదర్శి గోఖలే మీడియాతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాలాకోట్‌‌లోని జైష్-ఎ-మహ్మాద్ శిబిరంపై వైమానిక దాడిచేశాం. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మరిన్ని ఆత్మహుతిదాడులు జరుగుతాయని మాకు సమాచారం ఉంది. దాన్ని నివారించడానికి వైమానికదాడులు చేయాల్సి వచ్చింది. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో జైష్-ఎ-మహ్మాద్ హస్తం ఉంది.

ఎన్నిసార్లు చెప్పినా పాక్ చర్యలు తీసుకోలేదు. పాక్ ప్రభుత్వం మద్దతులేనిదే ఉగ్రదాడులు జరగవు. పీవోకేలో వందలాది ఉగ్రవాద శిబిరాలున్నాయి. బాలాకోట్‌‌లో జైష్-ఎ-మహ్మద్ క్యాంపును ధ్వంసం చేశాం. బాలాకోట్‌లో అజహర్ మసూద్ బావమరిది యుసుఫ్ అజహర్ క్యాంప్ నడిపిస్తున్నాడు. జైష్-ఎ-మహ్మద్ సంస్థకు కోలుకులేని దెబ్బ తగిలింది. బాలాకోట్‌‌లోని పెద్ద ఎత్తున జైషే ఉగ్రవాదులను మట్టుబెట్టాం. వైమానిక దాడిలో పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదు. కచ్చితమైన సమాచారంతో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాం అని విదేశాంగ కార్యదర్శి స్పష్టం చేశారు. సో.. సర్జికల్ స్ట్రైక్స్ ‌నిజమేనని క్లారిటీ వచ్చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇండియన్ ఆర్మీపై ప్రశంసలు వర్షం కురిపిస్తోంది.