వంగ‌వీటి లుక్ లో సురేష్ కొండేటి

  • IndiaGlitz, [Wednesday,July 03 2019]

ఒక కులం అండ‌తో నాయ‌కుడైనా .. ప్ర‌త్య‌ర్థి సామాజిక వ‌ర్గం యువ‌తిని పెళ్లాడి.. ప్ర‌త్య‌ర్థి కులాల పేద‌ల్ని ఆదుకుని.. ఏ ఒక్క కులానికో ప‌రిమితం కాని నాయ‌కుడ‌య్యాడు వంగ‌వీటి రంగా. పేద‌- బ‌డుగు-బ‌ల‌హీన వ‌ర్గాల ఆరాధ్య దైవంగా అవ‌త‌రించాడు. ఒక రకంగా అత‌డు కాపు క‌మ్యూనిటీ నుంచి పుట్టుకొచ్చిన‌ రాబిన్ హుడ్ అని చ‌రిత్ర చెబుతోంది. బెజ‌వాడ రాజ‌కీయాల్లో సుదీర్ఘ ప్ర‌స్థానం సాగించిన మేటి నాయ‌కుడిగా వంగ‌వీటి రంగా (జూలై 4 జ‌న‌నం- 26 డిసెంబ‌ర్ మ‌ర‌ణం) ప్ర‌స్థానం ఎంతో గొప్ప‌ది. బెజ‌వాడ రౌడీ రాజకీయాల్లో అత‌డి హ‌త్య పేద‌ల గుండెల్ని మ‌రిగించింది. వంగ‌వీటి రంగాకు ధీటైన వ‌ర్గంగా బెజ‌వాడ రాజ‌కీయాల్లో ఎదిగిన దేవినేని నెహ్రూ సోద‌రుల‌ ప్ర‌స్థానం అంతే గొప్ప‌ది. రంగా - నెహ్రూల మ‌ధ్య స్నేహం స్థానంలో శ‌త్రుత్వం పెర‌గడానికి ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉన్నాయి. అయితే అవ‌న్నీ చ‌రిత్ర‌లో నిక్షిప్తం అయ్యి ఉన్న గొప్ప న‌గ్న‌స‌త్యాలు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. బెజ‌వాడ పేరెత్తితే వినిపించే పేర్లు వంగ‌వీటి రంగా .. దేవినేని నెహ్రూ.

ఇప్పుడు ఆ ఇద్ద‌రి క‌థ‌తోనే సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి 'దేవినేని' అనే టైటిల్ ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. 'బెజవాడ సింహం' అనేది ఉప‌శీర్షిక‌. శివ‌నాగు ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌టి‌ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. దేవినేని నెహ్రూగా టైటిల్ పాత్ర‌లో నందమూరి తారకరత్న నటిస్తుండగా ..వంగవీటి రంగా పాాత్రలో ప్రముఖ పత్రికాధిపతి, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి (సంతోషం సురేష్) నటిస్తున్నారు. నేడు వంగ‌వీటి రంగా 72వ జ‌యంతి సంద‌ర్భంగా రంగా పాత్ర‌ధారి ఫ‌స్ట్ లుక్ ని చిత్ర‌యూనిట్ లాంచ్ చేసింది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శివ‌నాగు మాట్లాడుతూ.. బెజవాడలో జరిగిన ఇద్దరు మహానాయకుల మధ్య జరిగిన యదార్థ కథను కళ్ళకు కట్టినట్టు తెరకెక్కిస్తున్నామ‌ని తెలిపారు. నిర్మాత రామూరాథోడ్ మాట్లాడుతూ .. ''దేవినేని - రంగా పాత్ర‌లు ఒక‌దానితో ఒక‌టి పోటాపోటీగా ఉంటాయి. ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ చిత్రీకరిస్తున్న ఈ చిత్రం చాలా నేచురల్‌గా వుంటుంది. తాజాగా వంగ‌వీటి రంగా పాత్ర ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నాం. రంగా పాత్ర‌లో సురేష్ కొండేటి న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. దేవినేని పాత్ర‌లో తార‌కర‌త్న అంతే అద్భుతంగా న‌టించారు'' అని తెలిపారు.