ఇదే నా లాస్ట్ రీమేక్ ఫిల్మ్ అనడానికి కారణం అదే..! - సురేందర్ రెడ్డి
- IndiaGlitz, [Tuesday,December 06 2016]
అతనొక్కడే చిత్రంతో దర్శకుడిగా పరిచయమై...తొలి చిత్రంతోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఆతర్వాత ఎన్టీఆర్ తో అశోక్, ఊసరవెల్లి, మహేష్ తో అతిధి, రవితేజతో కిక్, కిక్ 2, అల్లు అర్జున్ తో రేసుగుర్రం చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం ధృవ. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ధృవ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఇంటర్ వ్యూ మీకోసం...!
చరణ్ కి, మీకు ధృవ సినిమా కీలకం కదా..రిజల్ట్ ఎలా ఉంటుందో అనే ప్రెజర్ ఫీలవుతున్నారా..?
చరణ్ కి, నాకు ఈ సినిమా కీలకమే కానీ...రిజల్ట్ ఎలా ఉంటుందో అనే ప్రెజర్ లేదు. సినిమా చేస్తున్నప్పుడు ప్రెజర్ ఫీలయ్యాను కానీ...రిజల్ట్ విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు. ఫస్ట్ టైమ్ రిలీజ్ కి ముందు రిలాక్స్ గా ఉన్నాను.
చరణ్ తో మీ సొంత కథతో సినిమా చేయాలి అనుకున్నారు కదా... ఆ టైమ్ లో రీమేక్ చేయమన్నప్పుడు మీ రియాక్షన్ ఏమిటి..?
కిక్ 2 తర్వాత చరణ్ తో సినిమా చేయడం కోసం గత కొన్ని రోజులుగా ట్రావెల్ అవుతున్నాను. ఆ టైమ్ లో ఒకరోజు చరణ్ తని ఓరువన్ సినిమా చూడమన్నారు. చూసిన తర్వాత ఎలా ఉంది.. నేను చేయచ్చా అని అడిగారు. చేయచ్చు అని చెప్పాను. ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అని అడిగితే నా అభిప్రాయం చెప్పాను. అప్పుడు నువ్వే చేయచ్చు కదా అన్నారు. అలా అంటారని ఊహించలేదు. దీంతో నాకు రెండు రోజులు టైమ్ కావాలి అన్నాను. ఆలోచించుకుని ఆతర్వాత ఓకే చేస్తాను అని చెప్పాను.
ధృవ రీమేక్ చేస్తాను అని చెప్పడానికి రెండు రోజులు టైమ్ తీసుకోవడానికి కారణం ఏమిటి..?
నేను అనుకున్న కధతో అయితే అప్పటి వరకు ట్రావెల్ అయ్యుంటాను కాబట్టి నాకు కంఫర్ట్ గా ఉంటుంది. రీమేక్ అనేసరికి ఇప్పటి వరకు చేయలేదు. చేస్తే ఎలా ఉంటుంది..? నేను చేయగలనా..? ఇలా ఆలోచించుకుని చెప్పడానికి టైమ్ తీసుకున్నాను.
ఫస్ట్ టైమ్ రీమేక్ చేసారు కదా..! ఇప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి..?
రీమేక్ చేయడం అనేది చాలా కష్టమైన జాబ్. లైఫ్ లో రీమేక్ చేయకూడదు అనిపించింది. ఇదే నా లాస్ట్ రీమేక్ ఫిల్మ్. ఒకవేళ రీమేక్ చేయాల్సి వస్తే...కథలో మార్పులు చేయడానికి వీలు ఉంటేనే చేస్తాను లేకపోతే రీమేక్ చేయను.
తని ఓరువన్ కి - ధృవ కి ఎలాంటి మార్పులు చేసారు..?
కావాలని మార్పులు చేయలేదు స్ర్కిప్ట్ లో అవసరం మేరకు మార్పులు చేసాం.
అరవింద్ స్వామి క్యారెక్టర్ లో మార్పులు చేసారని...పాత్ర నిడివి కొంచెం తగ్గించారని అంటున్నారు నిజమేనా..?
అందులో ఏమాత్రం నిజం లేదు. అరవింద్ స్వామి పాత్ర కాస్త పెరిగిందేమో కానీ తగ్గలేదు.
అరవింద్ స్వామితో డిఫరెన్స్ వచ్చాయని...అందుచేత అరవింద్ స్వామి పాత్రను వేరే ఏక్టర్ తో చేయించాలి అనుకున్నారని విన్నాం...? నిజమేనా..?
లేదు..! తని ఓరువన్ రీమేక్ చేద్దాం అనుకున్నప్పుడే అరవింద్ స్వామిని అనుకున్నాం. కాకపోతే ఫస్ట్ డే షూటింగ్ రోజు అరవింద్ స్వామి, నేను ఇద్దరం స్ట్రగుల్ అయ్యాం. ఆతర్వాత ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఆతర్వాత ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు.
కాశ్మీర్ లో షూటింగ్ చేసారు కదా..! కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో తీసారా..?
పోలీస్ ట్రైనింగ్ సంబంధించిన సీన్స్ కోసం కాశ్మీర్ లో షూట్ చేసాం అంతే తప్పా...కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో తీయలేదు.
చరణ్ ఈ మూవీలో 6 ప్యాక్ చేసాడు కదా..? దీనికి ప్రత్యేక కారణం ఉందా..?
పోలీస్ అంటే ఫిట్ గా ఉండాలి కదా...అందుకని చరణ్ సిక్స్ ప్యాక్ చేస్తే బాగుంటుంది అని చేసాడు. ఈ క్యారెక్టర్ కోసం చరణ్ చాలా హార్డ్ వర్క్ చేసాడు. ఇక చరణ్ గురించి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏమిటంటే...ఈ సినిమాకి ముందు చరణ్ ని కలవలేదు.మీడియాలో రకరకాలుగా రాస్తుంటారు కదా..! మెగాస్టార్ కొడుకు చరణ్ బిహేవియర్ ఎలా ఉంటుందో అనుకునేవాడిని. అయితే...చరణ్ తో ట్రావెల్ అయిన తర్వాత తెలిసింది ఇప్పటి వరకు చరణ్ లాంటి హీరోను చూడలేదు. మాట ఇచ్చాడు అంటే మనం మరచిపోతామేమో కానీ చరణ్ మాత్రం మరచిపోడు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్పగలను.
మ్యూజిక్ డైరెక్టర్ గా హిప్ హిప్ తమిళనే తీసుకోవడానికి కారణం ఏమిటి..?
నన్ను కూడా చాలా మంది అడిగారు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవచ్చు కదా..! అన్నారు. తని ఓరువన్ కి హిప్ హప్ తమిళ నే మ్యూజిక్ అందించారు. ఈ మూవీకి వాళ్ళు అయితే కరెక్ట్ గా ఉంటుంది అనిపించింది. ఈ విషయాన్ని చరణ్ కి చెప్పగానే ఓకే అన్నాడు. ఈ మూవీకి మ్యూజిక్ అందించాలి అని హిప్ హప్ తమిళకి మేము చెప్పగానే అప్పటికే వాళ్లు ఎలా చేస్తే బాగుంటుందో అని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ధృవ హైలైట్స్ లో మ్యూజిక్ ఒకటిగా నిలుస్తుంది.
తని ఓరువన్ - ధృవ రన్ టైమ్ కి ఏమైనా తేడా ఉంటుందా..?
ఈ రెండింటికి రన్ టైమ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. 2.39 నిమిషాలు రన్ టైమ్.
2.39 నిమిషాలు రన్ టైమ్ అంటే కాస్త ఎక్కువేమో..?
ఈ మూవీకి ఇంత రన్ టైమ్ ఉండాలి. పైగా ఇటీవల కాలంలో రన్ టైమ్ ఎక్కువుగా ఉన్న శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాలు బ్లాక్ బష్టర్ గా నిలిచాయి. అందుచేత 2.39 నిమిషాలు రన్ టైమ్ అనేది ఏమాత్రం ప్రాబ్లమ్ కాదు.
మీ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ ఏంటే ఏ సినిమా చెబుతారు..?
ఊసరవెల్లి. ఈ మూవీ అంతగా సక్సెస్ కాకపోవచ్చు కానీ...నా కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అంటే ఊసరవెల్లి.
చరణ్ తో మూవీ చేసారు మరి...చిరంజీవితో కూడా సినిమా చేస్తారా..?
తప్పకుండా చేస్తాను. వచ్చే సంవత్సరం చిరంజీవి గారితో కిక్ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తాను.
నిర్మాతగా చిన్న సినిమాలు చేస్తాను అని గతంలో ప్రకటించారు కదా..?
అవును...నిర్మాతగా చిన్న సినిమాలు చేయాలి అని ఉంది. తప్పకుండా చేస్తాను.
జాగ్వార్ హీరో నిఖిల్ గౌడ్ తో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి..?
నిఖిల్ గౌడ్ తో సినిమా చేయమని అడిగారు ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే కానీ నేను ఈ సినిమా చేయడం లేదు.
నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?
ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. రెండు మూడు ఆఫర్స్ ఉన్నాయి. త్వరలో ఎనౌన్స్ చేస్తాను.