Chandrababu Naidu:సుప్రీంకోర్టుపైనే ఆశలు.. కాసేపట్లో చంద్రబాబు పిటిషన్‌ను విచారించనున్న సర్వోన్నత న్యాయస్థానం
- IndiaGlitz, [Wednesday,September 27 2023]
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్‌పీ)పై సుప్రీంకోర్టు విచారించనుంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై నిర్ణయం తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి.. బుధవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్ ధర్మాసనం ముందు చంద్రబాబు పిటిషన్ విచారించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో దాఖలు చేసిన పిటిషన్ క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పిటిషన్‌పై ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.
కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో వున్న చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ గత ఆదివారం మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన రిమాండ్‌ను మరో 11 రోజులు పొడిగించింది. దీంతో అక్టోబర్ 5వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్‌లోనే వుండనున్నారు. ఆదివారంతో ఆయన రిమాండ్ గడువుతో పాటు సీఐడీకి ఇచ్చిన రెండు రోజుల కస్టడీ గడువు కూడా ముగిసింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే వర్చువల్‌గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించాలని సీఐడీ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి అక్టోబర్ 5 వరకు రిమాండ్‌ను పొడిగించారు.