Rahul Gandhi:'మోడీ ఇంటి పేరు కేసు'.. రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ , శిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో రాహుల్‌ను దోషిగా తేలుస్తూ, సూరత్ కోర్ట్ విధించిన జైలు శిక్షపై సుప్రీంకోర్ట్ శుక్రవారం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తనపై విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. రాహుల్ తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
ఇదంతా రాహుల్‌పై కుట్ర :
రాహుల్‌పై పరువు నష్టం దావా వేసిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ అసలు ఇంటి పేరు మోడీ కాని.. ఆయన ఆ ఇంటి పేరును తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి సింఘ్వీ తీసుకెళ్లారు. రాహుల్ నేరస్థుడు కాదని, బీజేపీ నేతలు గతంలోనూ ఆయనపై అనేక కేసులు వేశారని వేటీలోనూ శిక్షలు పడలేదని సింఘ్వీ పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు , రాహుల్‌కు ఇదే చివరి అవకాశమని ఆయన వాదించారు. ఈ కేసులో కావాలనే రాహుల్ గాంధీకి గరిష్ట శిక్ష వేశారని.. ఈ కారణంగా ఆయన 8 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా వుండాల్సి వస్తుందని సింఘ్వీ వాదించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం రాహుల్ దోషి అంటూ సూరత్ కోర్ట్ విధించిన శిక్షపై స్టే విధించింది. అలాగే ఆయనపై రెండేళ్ల శిక్ష విధించడానికి సరైన కారణమేదీ ట్రయల్ కోర్ట్ చూపించలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అసలేంటీ వివాదం :
కాగా.. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కర్ణాటకలోని కోలార్‌లో ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ధిక నేరగాళ్లు లలిత్ మోడీ, నీరవ్ మోడీల పేర్లను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరే ఎందుకు వుంటోందోనంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుబట్టారు. అంతేకాదు.. అప్పట్లోనే రాహుల్‌పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై సూరత్‌లోని చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ నాలుగేళ్ల పాటు విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అయితే రాహుల్ గాంధీ అభ్యర్ధన మేరకు వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.
మరుసటి రోజే రాహుల్‌పై అనర్హత :
అయితే పరువు నష్టం కేసులో సూరత్ కోర్ట్ రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్స విధించిన మరుసటి రోజే ఆయనపై లోక్‌సభ అనర్హత వేటు వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఇ)లోని నిబంధనల ప్రకారం.. రాహుల్ గాంధీ దోషిగా తేలిన తేదీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడైనట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ తెలిపింది. తనపై విధించిన శిక్షను రద్దు చేయాల్సిందిగా రాహుల్ గాంధీ సూరత్ కోర్ట్‌ను, గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout