నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీం స్టే...
Send us your feedback to audioarticles@vaarta.com
నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. నేడు కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై చర్చలు జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ కమిటీ రైతు ప్రతినిధులు, ప్రభుత్వంతో కమిటీ చర్చలు జరుపుతుంది. సమస్య పరిష్కారం కాకుంటే కమిటీని సంప్రదించవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. కాగా.. కమిటీ సభ్యులుగా అశోక్ గులాటి, అనిల్ ధన్వంత్, హర్సిమ్రత్ మాన్, ప్రమోద్ జోషిలను ఏర్పాటు చేసింది.
కమిటీ ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదని.. తమకు నివేదిక సమర్పించేందుకే కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టాలను నిలిపివేసి అధికారం తమకు ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిపింది. తమకున్న హక్కులకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని సీజేఐ పేర్కొన్నారు.
రైతుల తరఫున వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ అడ్వకేట్ ఎంఎల్ శర్మ పిటిషన్లు వేశారు. నేడు విచారణ సందర్భంగా ఆయన తన వాదనలు ఆయన వినిపించారు. కోర్టు ఏర్పాటు చేసే ఏ కమిటీ ముందు తాము హాజరు కావాలనుకోవడం లేదని రైతులు చెబుతున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చర్చలకు చాలా మందే వస్తున్నప్పటికీ అసలు వ్యక్తి అయిన ప్రధాని మోదీ రావడం లేదని రైతులు భావిస్తున్నారని కోర్టుకు వివరించారు. కాగా.. రైతు నిరసనలకు నిషేధిత సంస్థ ఒకటి సహకరిస్తోందంటూ ఒక దరఖాస్తు తమ ముందు ఉందని సీజేఐ పేర్కొన్నారు. అటార్నీ జనరల్ దీనిని అంగీకరిస్తారా.. లేదా అని సీజేఐ ప్రశ్నించారు. దీనికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ, నిరసనల్లోకి ఖలిస్థానీలు చొరబడ్డారని మాత్రమే తాము చెప్పామని కోర్టుకు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments