వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు వ్యవహారంలో చంద్రబాబుకు సుప్రీం షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మరో 21 పార్టీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. విపక్షాల పిటిషన్‌పై మంగళవారం ఉదయం విచారణ జరిగింది. కేవలం సింగిల్ మినిట్‌లో ధర్మాసనం తేల్చేసింది. ఈ విషయంలో మేమిచ్చిన తీర్పును సవరించేందుకు ఆసక్తిగా లేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ రివ్యూ పిటిషన్లను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించలేదు. సుప్రీం కోర్టు తీర్పు సింగిల్ మినిట్‌లో ఇచ్చిన తీర్పుతో విపక్షాలు కంగుతిన్నాయి. తీర్పు విన్న విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు చేసేదీమీ లేక తిన్నగా బయటికొచ్చేశాయి.
అసలు విషయమేంటి..!?
దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని.. అందుకే కౌంటింగ్ రోజు లెక్కించే వీవీప్యాట్ స్లిప్పులు కనీసం 50 శాతం పెంచాలంటూ చంద్రబాబుతో పాటు విపక్ష పార్టీలు ఈసీని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీవీప్యాట్ స్లిప్స్ 50 శాతం లెక్కించాలంటే కనీసం వారంరోజులకు పైగా పడుతుందని అది సాధ్యంకాని పనని ఈసీ స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబుతో సహా విపక్ష పార్టీలన్నీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై మంగళవారం విచారణ జరిపిన కోర్టు గతంలో తామిచ్చిన ఆదేశాలను మళ్లీ మార్చలేమని తేల్చిచెప్పింది. దీంతో చంద్రబాబుతో సహా విపక్షాలకు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కాగా ఒక శాసనసభ నియోజకవర్గంలోని అయిదు వీవీప్యాట్ స్లిప్పులను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో సరిపోల్చాలని ఎన్నికల కమిషన్‌ను ఏప్రిల్ 8న ఆదేశించిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు రియాక్షన్ ఇదీ...
సుప్రీం కోర్టు తీర్పుపై సీఎం చంద్రబాబు స్పందించారు. తీర్పు అనంతరం విపక్షాల లాయర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. సుప్రీం కోర్టు తీర్పును ఆహ్వానిస్తామన్నారు. 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు అనేది న్యాయమైన డిమాండ్ అని అన్నారు. స్లిప్పుల లెక్కింపునకు 6రోజులు పడుతుందని ఈసీ చెబుతోందని.. సమయం కంటే పారదర్శకత ముఖ్యమని ఈసీ గుర్తించాలన్నారు. 21 పార్టీల నేతలంతా కలసి మళ్లీ ఈసీని కలుస్తామని.. ఈవీఎంలపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. బిహార్‌లోని ఓ హోటల్‌లో 6 ఈవీఎం మిషన్లు లభ్యమైన వ్యవహారాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్లలో ఓట్ల మధ్య తేడా ఉంటే నియోజవర్గం మొత్తం స్లిప్పులన్నీ లెక్కించాలని బాబు డిమాండ్ చేశారు. ఇప్పటితో మా పోరాటం ఆగలేదని ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments